జగన్ అర్థం కావాలంటే నాయకుడు సినిమా చూడాల్సిందే..
నాయకుడు సినిమాలో రఘువీరా (ఉదయనిధి స్టాలిన్) పందులను పెంచుకునే కులానికి చెందినవాడు. ఆయన తండ్రి ఎమ్మెల్యే. అయితే, ఆయన నియోజకవర్గం రిజర్వ్ కావడం వల్ల ఆధిపత్య కులానికి చెందిన రాజకీయ నాయకుడు రఘువీరా తండ్రి మహారాజు (వడివేలు)ను ఎన్నికల్లో నిలబెడతాడు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విజన్ అర్థం కావాలంటే ఉదయనిధి నటించిన నాయకుడు సినిమా చూడాల్సిందే. పేద కులాల సాధికారిత సాధనకు నాయకుడనే వాడు ఏం చేయాలనే విషయం ఆ సినిమా చూస్తే అర్థమవుతుంది. ముఖ్యమంత్రిగా జగన్ ఏం చేస్తున్నారనేది అర్థమవుతుంది. అడుగడుగునా అవమానాలు ఎదురవుతున్న సమాజంలో పేద కులాల ప్రజలు ఆత్మగౌరవంతో జీవించడానికి, ఉన్నత స్థాయికి ఎదగడానికి ఏం కావాలనే విషయాన్ని జగన్ గమనంలోకి తీసుకున్నారు కాబట్టే విద్యరంగంలో సంస్కరణలను చేపట్టారు. వైఎస్ జగన్ పాఠశాలలను ఆధునీకరించి, వాటిలో అన్ని హంగులు కల్పించి, ఇంగ్లీష్ మాద్యమాన్ని అందుబాటులోకి తేవడం వల్ల పేద కులాల, దళిత కులాల పిల్లలు ధనిక, ఆధిపత్య కులాల పిల్లలకు దీటుగా చదువుకోగలుగుతారు, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చదువుకుంటున్నారు కూడా.
నాయకుడు సినిమాలో రఘువీరా (ఉదయనిధి స్టాలిన్) పందులను పెంచుకునే కులానికి చెందినవాడు. ఆయన తండ్రి ఎమ్మెల్యే. అయితే, ఆయన నియోజకవర్గం రిజర్వ్ కావడం వల్ల ఆధిపత్య కులానికి చెందిన రాజకీయ నాయకుడు రఘువీరా తండ్రి మహారాజు (వడివేలు)ను ఎన్నికల్లో నిలబెడతాడు. తనకు అత్యంత ముఖ్యమైన అనుచరుడు కాబట్టి తమ ప్రయోజనాలు నెరవేర్చుకోవడానికి అడ్డు రాడు కాబట్టి ఆయనను ఎమ్మెల్యేగా గెలిపించుకుంటాడు. ఎమ్యెల్యే అయినప్పటికీ మహరాజు ఆధిపత్య కులానికి చెందిన రాజకీయనాయకుడితో సమానంగా కూర్చోలేడు. ఆధిపత్య కులానికి చెందిన రాజకీయ నాయకుడికి చెందిన కుటుంబ సభ్యుల ముందు తలవంచుకునే ఉంటాడు. వారు ఏది చెప్తే అదే చేస్తాడు.
మహరాజు కుమారుడు రఘువీరా అలియాస్ వీర చదువుకుంటాడు. దానివల్ల అతనిలో ఆత్మగౌరవాన్ని కాపాడుకునే గుణం అలవడుతుంది. దాంతో అగ్రకుల రాజకీయ నాయకులతో ఆత్మగౌరవం కోసం ఘర్షణ పడాల్సి వస్తుంది. తన మిత్రురాలు లీల నడిపే కోచింగ్ సెంటర్‌ను తమ విద్యాసంస్థల లాభాలకు గండికొడుతుందనే ఉద్దేశంతో ఆధిపత్య కులానికి చెందిన వ్యక్తి మూసేయిస్తాడు. లీల తన కోచింగ్ సెంటర్‌ను నడుపుకోవడానికి వీర తనకు చెందిన స్థలాన్ని ఇస్తాడు. అందులోనే వీరా దళిత పిల్లలకు ఫిజికల్ ట్రైనింగ్ ఇస్తుంటాడు. దాంతో ఆధిపత్య కులానికి చెందిన రాజకీయవేత్తతో ఘర్షణ వాతావరణం ఏర్పడుతుంది.
వీరాకు నచ్చజెప్పడానికి మహరాజును ఆధిపత్య కులానికి చెందిన నాయకుడు పిలిపిస్తాడు. తండ్రితో పాటు వీర కూడా వెళ్తాడు. ఆధిపత్య కులానికి చెందిన వ్యక్తులు కూర్చుని ఉండగా, మహరాజు నిలబడే ఉంటాడు. అక్కడ వివక్షను సహించలేక తన తండ్రిని వీరా కుర్చీలో కూర్చోబెట్టే ప్రయత్నం చేస్తాడు. దాంతో మళ్లీ ఘర్షణ జరుగుతుంది. చివరకు ముఖ్యమంత్రి సహాయంతో మహరాజు స్థానిక రాజకీయ నాయకుడు అవతలి పార్టీలోకి మారి, ఎన్ని అడ్డంకులు కల్పించినప్పటికీ గెలుస్తాడు. ఇదీ కథ.
సినిమాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌లాంటివాడే. దళితులు సామాజికంగా ఎదగడానికి, ఆధిపత్య కులానికి చెందినవారితో సమానంగా సామాజిక హోదా పొందడానికి ముఖ్యమంత్రి సహకరిస్తాడు. వైఎస్ జగన్ చేస్తున్నది కూడా అదే. దళిత కులాల పిల్లలు, పేదలు సామాజిక హోదాను పొంది ఆత్మగౌరవంతో జీవించడానికి పాఠశాల స్థాయిలోనే పాదులు వేశారు. దానివల్ల ఉన్నత స్థానాలు పొంది ఆర్థికంగా ఎదుగుతారు. ఆత్మగౌరవంతోనూ తగిన సంపాదనతోనూ సమాజంలో ఉన్నత స్థాయి పౌరులుగా ఎదుగుతారు. ఇదీ జగన్ ఆలోచన, విజన్.