విశాఖలో జీవీఎల్‌కు ఇస్తే.. నరసాపురంలో రఘురామకు లైన్ క్లియర్
తాజాగా జీవీఎల్‌కే సీటివ్వాలంటూ జనజాగరణ సమితి పేరిట విశాఖ నగరవ్యాప్తంగా వెలిసిన పోస్టర్లు రాజకీయంగా కలకలం రేపుతున్నాయి. బీజేపీ నిజంగా ఒత్తిడి చేసి ఆ సీటు జీవీఎల్‌కు ఇస్తే మాత్రం రఘురామకృష్ణరాజు నెత్తిన పాలుపోసినట్లే.
ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైకాపా ఒకేసారి 175 ఎమ్మెల్యే, 25 ఎంపీ సీట్లు ప్రకటించి, ప్రచారంలో దూసుకుపోతుంటే.. టీడీపీ, జనసేన, బీజేపీ మాత్రం సీట్ల కుమ్ములాటల్లో మునిగితేలుతోంది. ప్రకటించిన సీట్లలో మార్పుచేర్పులతో టికెట్ కాపాడుకోవడానికి అధినేతల చుట్టూ తిరగాలో, ఓట్ల కోసం ఓటర్ల దగ్గరకి వెళ్లాలో అర్థంకాక అభ్యర్థులు తల పట్టుకుంటున్నారు. పొత్తులో విశాఖ ఎంపీ సీటును టీడీపీ తీసుకుంది. అయితే ఇక్కడ జీవీఎల్‌కు సీటు కోసం బీజేపీ ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంది. తాజాగా జీవీఎల్‌కే సీటివ్వాలంటూ జనజాగరణ సమితి పేరిట విశాఖ నగరవ్యాప్తంగా వెలిసిన పోస్టర్లు రాజకీయంగా కలకలం రేపుతున్నాయి. బీజేపీ నిజంగా ఒత్తిడి చేసి ఆ సీటు జీవీఎల్‌కు ఇస్తే మాత్రం రఘురామకృష్ణరాజు నెత్తిన పాలుపోసినట్లే.
విశాఖ వదిలేస్తే నరసాపురం అడుగుతారు
ఒకవేళ విశాఖపట్నం వదిలేస్తే నరసాపురం సీటును తమకివ్వాలని టీడీపీ అడగడం ఖాయం. అక్కడ వైసీపీకి చెందిన సిటింగ్ ఎంపీ రఘురామ కృష్ణరాజు నిన్ననే టీడీపీలో చేరారు. కానీ నాలుగేళ్లుగా ఆయన టీడీపీతోనే అంటకాగుతున్న సంగతి అందరికీ తెలుసు. విశాఖలో జీవీఎల్‌కు ఇవ్వాలని నిజంగా బీజేపీ పట్టుబడితే టీడీపీ దాన్ని వదిలేసుకుని నరసాపురం తీసుకుని రఘురామను అక్కడ నిలబెడుతుందని ఆ పార్టీ వర్గాల టాక్
వదులుకోవడానికి టీడీపీ ఇష్టపడుతుందా?
2019 ఎన్నికల్లో విశాఖలో టీడీపీ అభ్యర్థి శ్రీభరత్ వైసీపీ అభ్యర్థి ఎంవీ సత్యానారాయణ చేతిలో కేవలం 4,414 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో జనసేన అభ్యర్థి వి.వి.లక్ష్మీనారాయణకు ఏకంగా 2.88 లక్షల ఓట్లొచ్చాయి. బీజేపీ అభ్యర్థి పురందేశ్వరి 33,892 ఓట్లు తెచ్చుకున్నారు. ఇప్పడు జనసేన, బీజేపీ కూడా కలిసినందున భరత్ సునాయాసంగా గెలుస్తారని టీడీపీ అంచనా వేస్తోంది. అదీకాక అక్కడున్న అభ్యర్థి చినబాబు లోకేశ్ తోడల్లుడైన శ్రీభరత్. కాబట్టి చంద్రబాబు ఒప్పుకున్నా, లోకేశ్‌ను ఒప్పించడం కష్టమేనని పార్టీలో మరో వర్గం మాట.