Telugu Global
Andhra Pradesh

ఉద్యోగులు అన్యాయమైపోతారా?

సీపీఎస్‌ను రద్దు చేసి మధ్యేమార్గంగా గ్యారెంటీ పెన్షన్ స్కీమ్(జీపీఎస్)ను ప్ర‌భుత్వం తెచ్చింది. ఉద్యోగులు దీన్నికూడా వ్యతిరేకిస్తున్నారు. తమకు ఓపీఎస్ అమలు చేయాల్సిందే అని మంకుపట్టు పట్టుకుని కూర్చున్నారు. ఉద్యోగులు ఇదే వైఖరిని అవలంభిస్తే నష్టపోయేది వాళ్ళు మాత్రమే.

ఉద్యోగులు అన్యాయమైపోతారా?
X

మంకుపట్టు పడితే చివరకు అన్యాయమైపోయేది ఉద్యోగులే. ఉద్యోగుల్లో కొందరికి, ప్రభుత్వానికి మధ్య ఓ డిమాండు విషయంలో మధ్యేమార్గం కుదరటంలేదు. ఇంతకీ ఆ జటిలమైన డిమాండ్ ఏమిటంటే పెన్షన్ విధానం. కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్(సీపీఎస్) రద్దుచేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్(ఓపీఎస్) అమలుచేయాలని ఉద్యోగుల్లో కొన్ని సంఘాలు డిమాండ్లు చేస్తున్నాయి. తమ డిమాండును ఆమోదిచకపోతే తమ తడాఖా ఏమిటో చూపిస్తామన్నట్లు చాలెంజ్‌లు విసురుతున్నాయి. ఉద్యోగుల్లో కొందరు అని చెబుతున్నది ఎందుకంటే 2004 తర్వాత ప్రభుత్వ సర్వీసులో చేరినవారికి సీపీఎస్ వర్తింపచేలా యూపీఏ ప్రభుత్వం డిసైడ్ చేసింది.

అప్పటి నుండి ఉద్యోగుల్లో కొన్ని సెక్షన్లు సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలుచేయాలని డిమాండ్లు చేస్తున్నారు. అయితే ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ఉద్యోగులతో మాట్లాడుతూ.. తాను అధికారంలోకి వస్తే వారంలో సీపీఎస్ రద్దు చేస్తానని హామీఇచ్చారు. నిజానికి ఎలాంటి అధ్యయనం చేయకుండానే జగన్ ఇచ్చిన హామీ ఇది. అధికారంలోకి వచ్చిన తర్వాతే తన హామీలోని లోతులేంటో జగన్‌కు తెలిసింది. అందుకనే సీపీఎస్ స్థానంలో ఓపీఎస్ తెచ్చే విషయంలో బాగా ఆలస్యం చేశారు.

చివరకు సీపీఎస్‌ను రద్దు చేసి మధ్యేమార్గంగా గ్యారెంటీ పెన్షన్ స్కీమ్(జీపీఎస్) తెచ్చారు. ఉద్యోగులు దీన్నికూడా వ్యతిరేకిస్తున్నారు. తమకు ఓపీఎస్ అమలుచేయాల్సిందే అని మంకుపట్టు పట్టుకుని కూర్చున్నారు. ఉద్యోగులు ఇదే వైఖరిని అవలంభిస్తే నష్టపోయేది వాళ్ళు మాత్రమే. ఎందుకంటే ఓపీఎస్ అమలు చేయాలంటే వేల కోట్ల రూపాయల భారం పెరిగిపోతుందని ఆర్థిక నిపుణులంటున్నారు. ఉద్యోగులకు చెల్లించే జీతాల కన్నా రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించే పెన్షనే బాగా పెరిగిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం ఉద్యోగులకు కూడా బాగా తెలుసు.

అయినా సరే తమకు ఓపీఎస్సే కావాలని పట్టుబడుతున్నారు. ఓపీఎస్ ఎట్టి పరిస్థితుల్లోనూ అమలుచేసేది లేదని జగన్ గట్టిగానే చెప్పేశారు. ప్రభుత్వాన్ని రాబోయే ఎన్నికల్లో ఓడగొడతామన్నట్లుగా కొందరు ఉద్యోగులు చాలెంజ్‌లు చేస్తున్నారు. నిజానికి ఉద్యోగులు ఏ పార్టీని కూడా ఓడించలేరు, గెలిపించలేరు. కానీ ఉద్యోగులతో పెట్టుకుంటే ప్రభుత్వాలు మారిపోతాయనే అభిప్రాయం బలంగా నాటుకుపోయింది. అందుకనే ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎగిరెగిరి పడుతున్నాయి. కొసమెరుపు ఏమిటంటే ఓపీఎస్ అమలు సాధ్యం కాదని బాగా తెలుసు కాబట్టే చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ దీనిపై అసలు నోరుకూడా విప్పటంలేదు.

First Published:  11 July 2023 11:37 AM IST
Next Story