స్టిక్కర్లను నమ్ముకుంటే మునిగిపోతారా?
అధికారంలో ఎవరున్నా పథకాలు ఆగవని జనాలు అనుకుంటే అప్పుడు వైసీపీకి మాత్రమే ఓట్లేసే విషయాన్ని ఆలోచిస్తారు. కాబట్టి ఏ రకంగా చూసినా స్టిక్కర్ల ప్రయోగం అంతగా వర్కవుట్ కాదేమో అనిపిస్తోంది.
రాబోయే ఎన్నికల్లో జననాడిని తెలుసుకునేందుకు వైసీపీ ఒక ప్రయోగం చేయబోతోంది. అదేమిటంటే ‘మా నమ్మకం నువ్వే జగన్’ అని ముద్రించిన స్టిక్కర్లను రాష్ట్రవ్యాప్తంగా అంటించాలని డిసైడ్ అయ్యింది. ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాలను అందుకుంటున్న లబ్దిదారుల ఇళ్ళకు ఈ స్టిక్కర్లను అంటించాలని అనుకుంటున్నారు. తమ ఇళ్ళకు స్టిక్కర్లను అంటించటానికి అంగీకరించిన లబ్దిదారులు తిరిగి తమకే ఓట్లేస్తారని పార్టీ అనుకుంటోంది. ఒకవేళ స్టిక్కర్లను అంటించటానికి ఇష్టపడనివాళ్ళు తమకు ఓట్లేయరని నిర్ధారణకు వస్తారట.
జగన్ బొమ్మతో భారీ సంఖ్యలో స్టిక్కర్లు రెడీ అవుతున్నాయి. ఈ స్టిక్కర్లో ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల వివరాలు, పథకాలకు చేస్తున్న ఖర్చు, పథకాలవారీగా లబ్దిపొందుతున్నవారి సంఖ్య తదితర వివరాలుంటాయి. ఇక్కడే స్టిక్కర్లు అంటించాలని అనుకుంటున్నవాళ్ళ ఆలోచనా శక్తిమీద అనుమానాలు పెరిగిపోతున్నాయి. సంక్షేమ పథకాలు అందుకోవటం వేరు, వైసీపీకి ఓట్లేయటం వేరు. సంక్షేమ పథకాల లబ్ధిదారులందరు వైసీపీకే ఓట్లేయాలని ఏమీలేదు. ఇష్టమైతే వేస్తారు లేకపోతే లేదంతే.
ఇక స్టిక్కర్లు అంటించటానికి అంగీకరించటం కూడా పెద్ద విషయం కాదు. స్టిక్కర్లు అంటించేందుకు అంగీకరించిన లబ్ధిదారులంతా తమకే ఓట్లేస్తారని ఎలా అనుకుంటారు? స్టిక్కర్లు అంటించుకోవటానికి అభ్యంతరాలు చెబితే సంక్షేమ పథకాలు తమకు ఆగిపోతాయనే భయంతో కూడా లబ్ధిదారులు స్టిక్కర్లు అంటించటానికి అడ్డుచెప్పక్కపోవచ్చు. ఇదే సమయంలో లబ్ధిదారుల్లో న్యూట్రల్స్ కూడా ఉంటారు. స్టిక్కర్లు అంటించవద్దంటే ఎక్కడ గొడవలవుతాయో అన్న భయంతో కూడా స్టిక్కర్లు అంటించేందుకు అంగీకరించచ్చు.
కాబట్టి స్టిక్కర్లు అంటించటాన్ని నమ్ముకుంటే వైసీపీ మీద దెబ్బపడిపోవటం ఖాయం. పార్టీ రహితంగా అర్హతల ఆధారంగా పథకాలు అందిస్తోంది కాబట్టి వైసీపీకి తిరిగి ఓట్లేయాలని లబ్ధిదారులు అనుకునేట్లు చేయాలంతే. జగన్మోహన్ రెడ్డి కాకుండా ఇంకెవరైనా అధికారంలోకి వస్తే ఈ పథకాలన్నీ ఆగిపోతాయని లబ్ధిదారులు అనుకుంటే రాబోయే ఎన్నికల్లో మళ్ళీ వైసీపీకే ఓట్లేస్తారు. అధికారంలో ఎవరున్నా పథకాలు ఆగవని జనాలు అనుకుంటే అప్పుడు వైసీపీకి మాత్రమే ఓట్లేసే విషయాన్ని ఆలోచిస్తారు. కాబట్టి ఏ రకంగా చూసినా స్టిక్కర్ల ప్రయోగం అంతగా వర్కవుట్ కాదేమో అనిపిస్తోంది.