ఇలాగైతే మధ్యంతర బెయిల్ రద్దు చేస్తాం..
పిటిషన్ ఏడాది పాటు పెండింగ్‌లో ఉండటానికి కారణం నారాయణేనని ప్రభుత్వ అదనపు అడ్వకేట్ జనరల్ వాదించారు. ఎలాగో అరెస్ట్ చేయకుండా మధ్యంతర బెయిల్ ఉండటంతో దాని మీదే కాలం వెళ్లదీసేందుకు నారాయణ ప్రయత్నిస్తున్నారని వివరించారు.
అమరావతి భూముల వ్యవహారంలో మాజీ మంత్రి నారాయణపై ఇది వరకే సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ 2022లో నారాయణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ నడుస్తుండగానే తనకు అనారోగ్యం ఉందని, అమెరికాలో చికిత్స తీసుకోవాలంటూ నారాయణ మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరారు. దాంతో హైకోర్టు అమెరికాలో చికిత్స వెళ్లేందుకు వీలుగా మధ్యంతర బెయిల్ ఇచ్చింది. దాంతో నారాయణను అరెస్ట్ చేయలేదు.
నారాయణ హైకోర్టులో ఏడాది క్రితం వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ మాత్రం ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉంది. బుధవారం ఈ పిటిషన్ మరోసారి విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి ఈ పిటిషన్ పెండింగ్‌లో ఉన్న తీరుపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఒక ముందస్తు బెయిల్ పిటిషన్ ఏడాది పాటు పెండింగ్‌లో ఉండటం తానెక్కడా చూడలేదని వ్యాఖ్యానించారు.
ఇలా పిటిషన్ ఏడాది పాటు పెండింగ్‌లో ఉండటానికి కారణం నారాయణేనని ప్రభుత్వ అదనపు అడ్వకేట్ జనరల్ వాదించారు. ఎలాగో అరెస్ట్ చేయకుండా మధ్యంతర బెయిల్ ఉండటంతో దాని మీదే కాలం వెళ్లదీసేందుకు నారాయణ ప్రయత్నిస్తున్నారని వివరించారు. పిటిషన్ విచారణకు వచ్చిన ప్రతిసారి సీనియర్ న్యాయవాది అందుబాటులో లేరు అంటూ వాయిదా కోరుతున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
బుధవారం కూడా నారాయణ తరఫు లాయర్లు అదే పనిచేశారు. నారాయణ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించాల్సి ఉందని.. కానీ, ఆయన వ్యక్తిగత కారణాల రిత్యా హాజరుకాలేకపోయారని నారాయణ తరఫు న్యాయవాదులు కోర్టుకు వివరించారు. దీనిపై న్యాయమూర్తి అభ్యంతరం తెలిపారు. ఒక ముందస్తు బెయిల్ పిటిషన్ ఏడాది పాటు పెండింగ్‌లో ఉండటం తానెక్కడా చూడలేదని.. ఇదే ఆఖరి అవకాశం.. వచ్చే విచారణలో వాదనలు వినిపించకపోతే.. మధ్యంతర బెయిల్ ఉత్తర్వులను రద్దు చేస్తామని.. అప్పుడు మీరు తీరిగ్గా వాదనలు వినిపించుకోవచ్చని నారాయణ తరపు న్యాయవాదులను ఉద్దేశించి కోర్టు వ్యాఖ్యానించింది. తదుపరి విచారణ 14వ తేదీకి వాయిదా పడింది.
*