పవన్ ఎంపీగా పోటీ చేస్తే పిఠాపురం బరిలో నిలిచేది నేనే..
తాజాగా కాకినాడ ఎంపీ అభ్యర్థిగా జనసేన నేత ఉదయ్ శ్రీనివాస్ ను పవన్ కళ్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఒకవేళ తనను ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా ఎంపీగా పోటీ చేయాలని సూచిస్తే ఉదయ్, తాను ఒకరి స్థానాలను మరొకరం మార్చుకుంటామన్నారు.
పిఠాపురం టీడీపీ ఇన్‌చార్జి ఎస్వీఎస్ఎన్ వర్మ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడ ఎంపీగా పోటీ చేస్తే.. తాను పిఠాపురం స్థానం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించి సంచలనం రేపారు. పొత్తులో భాగంగా పిఠాపురం స్థానం నుంచి తాను స్వయంగా పోటీ చేస్తున్నట్లు కొద్ది రోజుల కిందట పవన్ కళ్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. పవన్ ప్రకటన చేసిన వెంటనే ఆ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జిగా ఉన్న ఎస్వీఎస్ఎన్ వర్మ పార్టీపై తిరుగుబావుటా ఎగురవేశారు.
పవన్ కళ్యాణ్ పిఠాపురం స్థానం నుంచి పోటీ చేస్తానని ప్రకటించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పిఠాపురం నుంచి తాను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని ప్రకటించారు. పార్టీపై వర్మ తిరుగుబాటు చేసిన నేపథ్యంలో చంద్రబాబు ఆయన్ను తన వద్దకు పిలిపించుకొని బుజ్జగించారు. పిఠాపురంలో పవన్ గెలుపు కోసం పనిచేస్తే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సముచిత స్థానం కల్పిస్తానని హామీ ఇచ్చారు. దీంతో మెత్తబడ్డ వర్మ పవన్ గెలుపు కోసం కృషి చేస్తానని ప్రకటించారు.
ఇదిలా ఉంటే తాజాగా కాకినాడ ఎంపీ అభ్యర్థిగా జనసేన నేత ఉదయ్ శ్రీనివాస్ ను పవన్ కళ్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఒకవేళ తనను ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా ఎంపీగా పోటీ చేయాలని సూచిస్తే ఉదయ్, తాను ఒకరి స్థానాలను మరొకరం మార్చుకుంటామన్నారు. ఉదయ్ పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా, తాను కాకినాడ ఎంపీగా పోటీ చేస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు.
ఈ నేపథ్యంలో పవన్ వ్యాఖ్యలపై ఎస్వీఎస్ఎన్ వర్మ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. పొత్తులో భాగంగా కూటమి గెలుపు కోసం పని చేయాల్సి ఉంటుందన్నారు. అందుకోసం చంద్రబాబుకు ఇచ్చిన మాట కోసం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం కృషి చేస్తానని చెప్పారు. ఒకవేళ అమిత్ షా సూచన మేరకు పవన్ కళ్యాణ్ కాకినాడ ఎంపీగా పోటీ చేయాల్సి వస్తే పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి తానే పోటీ చేస్తానని ప్రకటించారు.
పవన్ కళ్యాణ్ పోటీ చేసే పిఠాపురం అసెంబ్లీ నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని ఇదివరకే వర్మ చేసిన ప్రకటనపై రెండు పార్టీల మధ్య తీవ్ర వివాదాన్ని సృష్టించింది. ఎలాగోలా అది సర్దుకుందని అనుకునే లోపే మరోసారి వర్మ కూటమిలో చిచ్చురేగేలా వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.