పవన్ చేస్తే ఒప్పు.. జగన్ చేస్తే తప్పా?
చంద్రబాబునాయుడులా తాను తప్పుడు హామీలు ఇచ్చి కాపులను మోసం చేయనని స్పష్టంగా చెప్పారు. జగన్ చెప్పిందాంట్లో తప్పేమీలేదు. మరీ విషయంలో పదేపదే జగన్‌ను ఎందుకు పవన్ తప్పుపడుతున్నారు. జగన్‌ను మాత్రమే కాదు వైసీపీకి ఓట్లేసిన కాపులను కూడా పవన్ తప్పుపడుతున్నారు.
‘జగన్మోహన్ రెడ్డిలా తాను అద్భుతాలు చేస్తానని చెప్పను.. మత్స్యకారులకు అది చేస్తా ఇది చేస్తా అని చెప్పను.. ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతాను’..ఇది జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు. కాకినాడలో మత్స్యకారులతో సమావేశమైనపుడు పై వ్యాఖ్యలు చేశారు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడటం చాలా మంచి లక్షణం. ఇప్పటి రాజకీయాల్లో ఎవరు ఇలాగ మాట్లాడటం లేదు కాబట్టి, తాను మాట్లాడుతున్నాను కాబట్టి తన నిజాయితీని అర్థంచేసుకోవాలని పవన్ జనాలను కోరుతున్నారు.
మరి 2019 ఎన్నికల్లో జగన్ చేసింది కూడా ఇదేకదా. కాపులకు రిజర్వేషన్ కల్పించాలని కాపు నేతలు జగన్‌ను అడిగారు. రిజర్వేషన్ అంశం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది కాబట్టి తాను హామీ ఇవ్వలేనని చెప్పారు. చంద్రబాబునాయుడులా తాను తప్పుడు హామీలు ఇచ్చి కాపులను మోసం చేయనని స్పష్టంగా చెప్పారు. జగన్ చెప్పిందాంట్లో తప్పేమీలేదు. మరీ విషయంలో పదేపదే జగన్‌ను ఎందుకు పవన్ తప్పుపడుతున్నారు. జగన్‌ను మాత్రమే కాదు వైసీపీకి ఓట్లేసిన కాపులను కూడా పవన్ తప్పుపడుతున్నారు.
నిజానికి రిజర్వేషన్ అంశం కేంద్రం పరిధిలోనిది. కేవలం ఓట్ల కోసమే అప్పట్లో చంద్రబాబు కాపులకు తప్పుడు హామీనిచ్చి మోసం చేసింది వాస్తవం. ఆ మోసంలో చంద్రబాబుకు మద్దతుగా నిలిచిన పవన్‌కూ భాగముంది. ఎందుకంటే చంద్రబాబు ఇచ్చిన హామీలను నెరవేర్చేలా తాను బాధ్యత తీసుకుంటానని పవన్ అప్పట్లో ప్రకటించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే చొక్కాపట్టుకుని నిలదీస్తానన్నారు. తర్వాత ఇద్దరూ కలిసే కాపులను ముంచారు. అబద్ధం చెప్పి కాపులను మోసం చేసిన చంద్రబాబును వదిలిపెట్టి నిజం చెప్పిన జగన్‌పైన పవన్ ఇప్పటికీ నానా గోల చేస్తున్నారు.
మత్స్యాకారుల సమావేశంలో తాను చేయగలిగేది మాత్రమే చెబుతానని పవన్ చెప్పినట్లే అప్పట్లో జగన్ కూడా అదే చెప్పారు. తాను చేసింది ఒప్పయితే జగన్ చేసింది తప్పెలాగవుతుంది ? ఇక్కడ విషయం ఏమిటంటే ఏదోరకంగా కాపులను జగన్‌కు దూరం చేయాలి. అందుకు మార్గం కనబడటంలేదు. పవన్ వెళ్ళి చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవటాన్ని కాపుల్లో చాలామంది వ్యతిరేకిస్తున్నారు. కాపులు ఓట్లేయకపోతే తనతో పాటు టీడీపీ కూడా నష్టపోతుంది. దీంతో ఏం చేయాలో అర్థంకాని పవన్ సంబంధంలేకపోయినా జగన్‌ను సీన్లోకి లాగుతున్నారు. మరి పవన్ ప్లాన్ ఎంతవరకు వర్కవుటవుతుందో చూడాలి.