Telugu Global
Andhra Pradesh

ఎన్టీఆర్ జపంతో ఓట్లు పడతాయా..?

ఇప్పటి తరానికి ఎన్టీఆర్ అంటే జూనియర్ ఎన్టీయార్ మాత్రమే. ఒక తరం ముందుకు వెళితే ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి సీఎం పదవితో పాటు పార్టీని కూడా చంద్రబాబు లాగేసుకున్నారనే విషయం బాగా తెలుసు.

ఎన్టీఆర్ జపంతో ఓట్లు పడతాయా..?
X

ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను ఎంతో ఘనంగా జరిపించాలని అనుకున్నా చివరకు నిర్వాహకుల కొద్దిబుద్ధుల కారణంగా చాలా పేలవంగా జరిగింది. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే.. శతజయంతి ఉత్సవాల పేరుతో టీడీపీ బహిరంగ సభలాగ మార్చాలని చేసిన ప్రయత్నమే అనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి. ఎన్టీఆర్ బతికున్నపుడు ద్రోహంచేసిందెవరు అనే విషయాన్ని ఇప్పుడు ప్రత్యేకంగా ఎవరికీ గుర్తుచేయాల్సిన అవసరంలేదు. ఆయనకు వెన్నుపోటు పొడిచిందెవరు, చావుకు కారణమైందెవరనే విషయాలు యూట్యూబ్ ఛానళ్ళల్లో దొరుకుతాయి.

ఈ విషయాలను పక్కనపెట్టేస్తే రాబోయే ఎన్నికల్లో ఎన్టీఆర్ జపం చేయటం ద్వారా ఓట్లు కొల్లగొట్టాలని, అధికారంలోకి రావాలని చంద్రబాబు నాయుడు విపరీతమైన ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే చంద్రబాబు ప్రయత్నాలు ఫలిస్తాయా అన్నదే సందేహం. ఇప్పుడు ఎన్టీఆర్ పేరుచెప్పి ఓట్లడిగితే జనాలెవరూ ఓట్లేసే పరిస్థితుల్లో లేరు. గడచిన ఎన్నికల్లో కూడా ఎన్టీఆర్ పేరుచెప్పే ఓట్లడిగారు. అయినా జనాలు ఓట్లేయలేదు.

ముఖ్య కారణం ఏమిటంటే.. ఇప్పటి తరానికి ఎన్టీఆర్ అంటే జూనియర్ ఎన్టీయార్ మాత్రమే. ఒక తరం ముందుకు వెళితే ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి సీఎం పదవితో పాటు పార్టీని కూడా చంద్రబాబు లాగేసుకున్నారనే విషయం బాగా తెలుసు. కాబట్టి ఎన్టీఆర్ జపంచేయటం ద్వారా అధికారంలోకి వచ్చేద్దామని చంద్రబాబు అనుకుంటే అది సాధ్యమయ్యేపనికాదు. ఇక ఎన్టీఆర్ కు భారతరత్న కోసం పోరాటాలు చేస్తూనే ఉంటామని చంద్రబాబు ప్రకటించటమే ఆశ్చర్యంగా ఉంది. అసలు ఇప్పటివరకు చంద్రబాబు చేసిన పోరాటమేముంది..? పైగా ఎన్టీఆర్ కు భారతరత్న రాకుండా చంద్రబాబే అడ్డుకుంటున్నారని లక్ష్మీపార్వతి చేస్తున్న ఆరోపణలు నిజమే అనిపిస్తోంది.

ఎందుకంటే.. అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడూ ఎన్టీఆర్ కు భారతరత్న పురస్కారం గురించి మాట్లాడని చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రమే మాట్లాడుతుంటారు. ఎన్టీఆర్ మీద చంద్రబాబుతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు ఏమాత్రం ప్రేముందో జనాలందరికీ బాగా తెలుసు. ఎన్టీఆర్ ను చూసైతే జనాలు టీడీపీకి ఓట్లేయరు. కాబట్టి వచ్చేఎన్నికల్లో అధికారంలోకి రావటంకోసం ఎన్టీఆర్ జపం మానేసి తనకు బాగా తెలిసిన, అలవాటైన మార్గాల్లో ప్రయత్నిస్తే ఏమైనా ఉపయోగాలు ఉంటాయమో ఆలోచించటం మంచిది.

First Published:  21 May 2023 10:52 AM IST
Next Story