Telugu Global
Andhra Pradesh

కర్నాటక ఓటింగే ఏపీలో రిపీటవుతుందా? అయితే కష్టమే..

కర్నాటక ఓటింగ్ ప్యాట్రనే ఏపీలో కూడా కంటిన్యూ అయితే మళ్ళీ వైసీపీనే గెలిచేందుకు అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అదే రిపీటతై ప్రతిపక్షాలు ఎంత ప్రయత్నించినా అధికారం కష్టమే.

కర్నాటక ఓటింగే ఏపీలో రిపీటవుతుందా? అయితే కష్టమే..
X

కర్నాటక ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు అందరికీ తెలిసిందే. ఫలితాల సరళిపై ఇంకా మీడియాలో విశ్లేషణలు వస్తునే ఉన్నాయి. మరో రెండు రోజులు ఈ విశ్లేషణలు కంటిన్యూ అవుతాయనటంలో సందేహంలేదు. ఇక్కడ పార్టీల బలాబలాల గురించి చర్చ చేయటంలేదు. కేవలం ఓటింగ్ ప్యాట్రన్ గురించి మాత్రమే చర్చ. ఆ ప్యాట్రన్ ఏమిటంటే అర్బన్ ప్రాంతాల్లో ఎక్కువగా బీజేపీకి ఓట్లుపడ్డాయి. రూరల్ ప్రాంతాల్లోని ఓట్లలో అత్యధికం కాంగ్రెస్‌కు పోలయ్యాయి.

బీజేపీ గెలిచిన 65 సీట్లలో ఎక్కువగా అర్బన్ నియోజకవర్గాలే ఎక్కువున్నాయి. మిగిలినవి గ్రామీణ ప్రాంత నియోజకవర్గాలు. వీటి సంఖ్య చాలా తక్కువనే చెప్పాలి. అర్బన్ ప్రాంత ఓటింగ్ అంటే బెంగుళూరు సిటి, జిల్లాల కేంద్రాలు, పెద్దస్థాయి పట్టణాల్లోని ఓటర్లలో ఎక్కువ శాతం బీజేపీ వైపు మొగ్గు చూపించారు. అంటే బీజేపీ అభివృద్ధి మంత్రం అర్బన్ ప్రాంత ఓటర్లపై ప్రభావం చూపించిందని అర్థ‌మవుతోంది. దీనికి అదనంగా నరేంద్ర మోడీ నిర్వహించిన ర్యాలీలు, రోడ్డు షోలు, పాల్గొన్న బహిరంగసభలు బీజేపీకి ఊపునిచ్చాయి.

ఇదేసమయంలో గ్రామీణ ప్రాంత నియోజకవర్గాల ఓటర్లలో అత్యధికం కాంగ్రెస్ వైపు మొగ్గు చూపించారు. కర్నాటకలోని 224 నియోజకవర్గాల్లో అత్యధికం రూరల్ ప్రాంతాలే కాబట్టి కాంగ్రెస్‌కు ఇంతటి మెజారిటి సాధ్యమైంది. అర్బన్ ప్రాంతాల్లో బీజేపీ ఓటు షేర్ 46 శాతమైతే, కాంగ్రెస్ షేర్ 43 శాతం. సెమీ అర్బన్ ప్రాంతాల్లో కాంగ్రెస్ ఓట్ల షేర్ 40 శాతమైతే, బీజేపీకి దక్కింది 36 శాతం. ఇక గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్‌కు వచ్చిన ఓట్లు 44 శాతమైతే బీజేపీకి దక్కింది 36 శాతం. ఇక సెమీ రూరల్ ప్రాంతాల్లో కాంగ్రెస్‌కు వచ్చిన ఓట్లు 44 శాతమైతే బీజేపీకి దక్కింది 29 శాతం మాత్రమే. దీన్నిబట్టే రూరట్, సెమీ రూరల్ ప్రాంతాల్లో బీజేపీకి ఎంత పెద్ద దెబ్బ పడిందో అర్థ‌మైపోతోంది.

దీన్ని ఏపీకి అన్వయిస్తే ఇక్కడ కూడా గ్రామీణ ప్రాంత నియోజకవర్గాలు చాలా ఎక్కువ. ఒక అంచనా ప్రకారం ఏపీలోని 175 నియోజకవర్గాల్లో సుమారు 130 నియోజకవర్గాలు గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. మిగిలిన నియోజకవర్గాలు వైజాగ్, విజయవాడ సిటిలతో పాటు జిల్లాల కేంద్రాల్లో ఉన్నాయి. ఒక మాదిరి పట్టణాల్లో కూడా గ్రామీణ ప్రాంతాల మండలాలే ఎక్కువ.

కర్నాటకలో గ్రామీణ ప్రాంతాల్లో జనాలను ఆకర్షించేందుకు గ్యారెంటీ పేరుతో కాంగ్రెస్ 5 హామీలనిచ్చింది. వాటికి ఆకర్షితులైన ప్రజలు కాంగ్రెస్‌కు బ్రహ్మరథం పట్టారు. ఏపీ విషయంలో చూస్తే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి నవరత్నాల రూపంలో సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. పథకాల లబ్ధిదారుల్లో ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలవాళ్ళు అందులోనూ పేదలు ఎక్కువగా ఉన్నారు. కర్నాటక ఓటింగ్ ప్యాట్రనే ఏపీలో కూడా కంటిన్యూ అయితే మళ్ళీ వైసీపీనే గెలిచేందుకు అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అదే రిపీటతై ప్రతిపక్షాలు ఎంత ప్రయత్నించినా అధికారం కష్టమే. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాల్సిందే.

First Published:  14 May 2023 9:05 AM IST
Next Story