సిగ్గు పడాల్సింది రామోజీ, ఆయన శిష్యుడు చంద్రబాబు కాదా..
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్ల కాలంలో విశాఖకు ఒక్క పేరున్న ఐటీ కంపెనీ కూడా రాలేదనే విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించాలి. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఐటీ కంపెనీలను ఆకర్షించడానికి ఐటీ ఇన్‌ఫ్రాను పెద్ద ఎత్తున ప్రోత్సహించడం ప్రారంభించారు.
ఐటీకి పొగ బెట్టారంటూ రామోజీరావు తన ఈనాడు పత్రికలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై దుష్ప్రచారానికి తెగబడ్డారు. తెలంగాణ నుంచి 2022-23లో రూ.2.41 లక్షల కోట్ల విలువైన ఐటీ ఎగుమతులు జరిగితే అందులో ఒక్క శాతమైనా ఏపీ నుంచి జరగలేదంటే సిగ్గుచేటు కాదా..? అని ప్రశ్నించారు. వాస్తవాలను పరిగణనలోకి తీసుకుంటే సిగ్గుపడాల్సింది రామోజీరావు, ఆయన అనుంగు శిష్యుడు చంద్రబాబు నాయుడేనని అర్థమవుతుంది.
ఆంధ్రప్రదేశ్ రాజధానిని అమరావతి పల్లెల్లో కాకుండా హైదరాబాద్ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతి పెద్ద నగరమైన విశాఖపట్నంలో పెట్టి ఉంటే ఈపాటికి హైదరాబాద్ అంత కాకపోయినా సగమైనా విశాఖపట్నం అభివృద్ధి చెంది ఉండేది. వాస్తవాలను పరిశీలిస్తే చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఇరగదీసిందేమీ లేదని అర్థమైపోతుంది.
చంద్రబాబు పాలనలో 2017-18 ఆర్థిక సంవత్సరంలో ఐటీ ఎగుమతుల విలువ రూ.969 కోట్లు, చంద్రబాబు దిగిపోయేనాటికి 2018-19లో వాటి విలువ రూ.986 కోట్లు. వరుసగా రెండేళ్ల పాటు కరోనా ఉన్నప్పటికీ వైఎస్ జగన్ పాలనలో 2022-23లో ఐటీ ఎగుమతుల విలువ రూ.1,867 కోట్లు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రి కాక ముందు 1995లో రాష్ట్రం 3వ స్థానంలో ఉండేది. చంద్రబాబు దిగిపోయేనాటికి ఏడో స్థానానికి పడిపోయింది. కావాలంటే రామోజీరావుకు ఈ లెక్కలు అందుబాటులో లేకుండా పోవు. ఈ లెక్కలను మరుగుపరిచి కల్పితకథలు అల్లడం ఒక విద్యగా రామోజీ అభ్యాసం చేశారు.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్ల కాలంలో విశాఖకు ఒక్క పేరున్న ఐటీ కంపెనీ కూడా రాలేదనే విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించాలి. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఐటీ కంపెనీలను ఆకర్షించడానికి ఐటీ ఇన్‌ఫ్రాను పెద్ద ఎత్తున ప్రోత్సహించడం ప్రారంభించారు.
డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయడంతో పాటు అదానీ గ్రూప్ భారీ ఐటీ టవర్‌ను నిర్మిస్తున్నది. రహేజా గ్రూప్ ఇనార్బిట్ మాల్‌ను నిర్మిస్తున్నది. దాంతో పాటు ఐటీ టవర్‌ను కడుతున్నది. ఏపీఐసీసీ రూ.2,300 కోట్ల వ్యయంతో మధురవాడలో 19 ఎకరాల విస్తీర్ణంలో ఐ స్పేస్ పేర ఐటీ టవర్‌ను నిర్మిస్తున్నది.
బీచ్ ఐటీ కాన్సెప్ట్‌తో ఆకర్షితులై ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్, యాక్సెంచర్, రాండ్‌స్టాడ్, డబ్ల్యూఎన్‌ఎస్, అమెజాన్ తదితర ఐటీ, ఐటీ అనుబంధ దిగ్గజ సంస్థలన్నీ విశాఖవైపు అడుగులు వేస్తున్నాయి. వైఎస్సార్ హయాంలో పురుడుపోసుకున్న విప్రో సంస్థ తన కార్యకలాపాలను విస్తరించేందుకు సిద్దమవుతున్నది.
ఐటీ పరిశోధనలు, అభివృద్ధిలో భాగంగా ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఎకో సిస్టమ్‌ను ఏర్పాటు చేయనున్నారు. అమెరికాకు చెందిన ప్రముఖ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ సంస్థ చెగ్ విశాఖలో కొత్త బ్రాంచ్‌ను ప్రారంభించింది. భారతదేశంలో ఢిల్లీ తర్వాత విశాఖలోనే చెగ్ సంస్థ బ్రాంచ్ ఏర్పాటు కావడం విశేషం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు దిగిపోయేనాటికి 178 ఐటీ కంపెనీలు ఉంటే, ప్రస్తుతం వైఎస్ జగన్ పాలనలో 372 ఉన్నాయి.