ఎమ్మెల్యేగా గెలిపిస్తే నా జీతమంతా వాలంటీర్లకే.. - దర్శి వైసీపీ ఇన్‌చార్జ్
స్థానిక సంస్థల ప్రతినిధుల కంటే గ్రామ, వార్డు వాలంటీర్లే ప్రజలకు ఎక్కువ సేవలందిస్తున్నారని శివప్రసాద్‌రెడ్డి తల్లి, ప్రకాశం జడ్పీ ఛైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ కొనియాడారు.
రాబోయే ఎన్నికల్లో తనను గెలిపిస్తే ఎమ్మెల్యేగా తనకొచ్చే జీతాన్ని వాలంటీర్లకే ఇస్తానని ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త బూచేపల్లి శివవ్రసాద్‌రెడ్డి ప్రకటించారు. అంతేకాదు తన తల్లిదండ్రులు బూచేపల్లి వెంకాయమ్మ, సుబ్బారెడ్డి చారిటబుల్ ట్రస్టు ద్వారా వాలంటీర్లకు బీమా సౌకర్యం కూడా కల్పిస్తానని చెప్పారు. వాలంటీర్లు తమ పరిధిలో ఉండే 50 కుటుంబాల వారిని కలిసి తనకు ఓట్లేయించి గెలిపించాలని ఆయన కోరారు.
వాలంటీర్లే పవర్‌ఫుల్
స్థానిక సంస్థల ప్రతినిధుల కంటే గ్రామ, వార్డు వాలంటీర్లే ప్రజలకు ఎక్కువ సేవలందిస్తున్నారని శివప్రసాద్‌రెడ్డి తల్లి, ప్రకాశం జడ్పీ ఛైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ కొనియాడారు. వాలంటీర్లతో ప్రజలకు ఇంటి ముంగిటకే ప్రభుత్వ సేవలన్నీ అందుతున్నాయని ఆమెచెప్పారు.
15 ఏళ్ల తర్వాత మళ్లీ పోటీ
2004లో బూచేపల్లి సుబ్బారెడ్డి దర్శి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన వారసుడిగా శివప్రసాద్‌రెడ్డి రాజకీయాల్లోకి వచ్చి 2009లో అక్కడ ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో ఆయన 1400 ఓట్ల స్వల్ప తేడాతో శిద్దా రాఘవరావు చేతిలో ఓడిపోయారు. 2019లో పార్టీ మద్దిశెట్టి వేణుగోపాల్‌కు వైసీపీ టికెటిచ్చింది. అయినా పార్టీకి విధేయుడిగా ఉన్న శివప్రసాద్‌రెడ్డికి ఈసారి జగన్ దర్శి సమన్వయకర్త బాధ్యతలు అప్పగించారు.