పవన్‌ను ఓడించకపోతే పేరు మార్చుకుంటా.. ముద్రగడ సంచలన శపథం
పవన్ కల్యాణ్ ఊరు ఎక్కడో చెప్పాలన్నారు ముద్రగడ. హైదరాబాద్‌లో పోటీ చేయకుండా.. తూర్పు గోదావరికి ఎందుకు వచ్చారని ప్రశ్నించారు.
జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌పై మరోసారి ఫైర్ అయ్యారు వైసీపీ లీడర్, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం. కిర్లంపూడిలో మీడియాతో మాట్లాడిన ముద్రగడ.. పిఠాపురంలో పవన్‌ను ఓడించకపోతే తన పేరు మార్చుకుంటానంటూ సంచలన శపథం చేశారు. ముద్రగడ పద్మనాభం పేరును పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానన్నారు. జగన్‌ను కుర్చీ నుంచి తప్పుకోమనడానికి పవన్‌కు ఏ హక్కు ఉందని ప్రశ్నించారు. అది ప్రజలు ఇచ్చిన కుర్చీ అన్న విషయం పవన్ మర్చిపోవద్దంటూ చురకలు అంటించారు.
పవన్‌కల్యాణ్ పదే పదే బూతులు మాట్లాడుతున్నారంటూ ఫైర్ అయ్యారు ముద్రగడ. ఓ పక్క పెద్దలను గౌరవిస్తానంటూనే.. మరో పక్క బూతులు మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. తుని రైలు ఘటనపై పవన్‌కల్యాణ్‌కు ఏ మాత్రం అవగాహనే లేదని, ఆ ఘటన వెనక వైసీపీ నేతల హస్తం ఉందనేది అవాస్తవమని కొట్టిపారేశారు. రైలు రోకో, రాస్తా రోకోలకు కర్త, కర్మ, క్రియ తానేనన్నారు ముద్రగడ. కానీ రైలును తగలబెట్టించింది మాత్రం చంద్రబాబేనని సంచలన ఆరోపణలు చేశారు.
పవన్ కల్యాణ్ ఊరు ఎక్కడో చెప్పాలన్నారు ముద్రగడ. హైదరాబాద్‌లో పోటీ చేయకుండా.. తూర్పు గోదావరికి ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే సహించేది లేదని పవన్‌ను హెచ్చరించారు. త్వరలోనే జనసేన పార్టీ ప్యాకప్ ఖాయమన్నారు.