Telugu Global
Andhra Pradesh

పోలవరం వద్ద హోటల్స్‌ నిర్మిస్తే, ఒక మంచి టూరిస్ట్‌ స్పాట్‌ అవుతుంది

పోలవరం విషయంలో ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని సీఎం జగన్ ఫైర్ అయ్యారు.

పోలవరం వద్ద హోటల్స్‌ నిర్మిస్తే, ఒక మంచి టూరిస్ట్‌ స్పాట్‌ అవుతుంది
X

పోలవరం విషయంలో ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని సీఎం జగన్ ఫైర్ అయ్యారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పరిశీలించిన ఆయన పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎగువ, దిగువ కాఫర్ డ్యాములతో పాటు దెబ్బతిన్న డయాఫ్రం వాల్‌ను పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. పనులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.

పోలవరం సైట్‌లో గైడ్‌ బండ్‌ కొద్ది మేర కుంగడంపై ఈనాడు పత్రిక బ్యానర్ ఐటమ్ ప్రచురించడంపైనా జగన్‌ ఫైర్ అయ్యారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో చిన్నచిన్న సమస్యలను కూడా విపత్తుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని ఆక్షేపించారు. ఇలాంటి దౌర్భాగ్యమైన మీడియా మన రాష్ట్రంలో ఉందన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎగువ కాఫర్ డ్యాం నిర్మాణం పూర్తి చేయకుండా గ్యాపులు వదిలేశారని దాన్ని వల్లనే డయాఫ్రం వాల్ దెబ్బతిందన్నారు. దాంతో రెండు వేల కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోందన్నారు.

గత ప్రభుత్వం చేసిన తప్పులు మాత్రం ఎల్లో మీడియాకు కనిపించడం లేదన్నారు. రామోజీరావుకు వియ్యంకుడే గతంలో కాంట్రాక్టర్ కాబట్టి వాటిని గురించి మాట్లాడరన్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో ఏమాత్రం భాగం కానిది గైడ్‌బండ్‌ అని సీఎం వివరించారు. దెబ్బతిన్న డయాఫ్రం వాల్‌ను త్వరగా పూర్తి చేయాలని.. అది పూర్తయితే ఇతర పనులు వేగంగా సాగేందుకు వీలుంటుందన్నారు.

డిసెంబర్‌ కల్లా డయాఫ్రం వాల్‌ పనులు పూర్తవుతాయని అధికారులు సీఎంకు వివరించారు. అనంతరం పోలవరం నిర్వాసిత కుటుంబాలకు పునరావాసంపైనా జగన్ సమీక్ష చేశారు. పునరావాస కాలనీల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. షెడ్యూల్‌ ప్రకారమే నిర్వాసిత కుటుంబాలను తరలించాలని స్పష్టం చేశారు. పోలవరం మంచి టూరిస్ట్‌ స్పాట్‌గా తీర్చిదిద్దాలని ఆదేశించారు. పర్యాటకలు ఉండేందుకు వీలుగా మంచి హోటల్స్‌ నిర్మించాలన్నారు. పోలవరం వద్ద బ్రిడ్జి కూడా నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. సరైన మౌలిక సదుపాయాలు కల్పిస్తే పోలవరం ఒక మంచి పర్యాటక కేంద్రం అవుతుందన్నారు సీఎం. తన పర్యటనలో జగన్ ఏరియల్ సర్వే కూడా చేశారు.

First Published:  6 Jun 2023 2:59 PM IST
Next Story