భవనం ప్రభుత్వానిది.. అద్దె లింగమనేనికా ధూళిపాళ్ళ..?
ధూళిపాళ్ళ చెబుతున్నట్లు నిజంగా భవనం లింగమనేనిదే అయితే అందులో ఉండేందుకు అనుమతి కోరుతూ ప్రభుత్వానికి చంద్రబాబు లేఖలు రాస్తున్నట్లు ఎలా చెప్పారు..?
ప్రజలను చంద్రబాబు నాయుడు మోసం చేశారు. కరకట్టమీద చంద్రబాబు ఉంటున్న భవనం లింగమనేని రమేష్‌ది అని ఇప్పుడు తమ్ముళ్ళు గొంతుచించుకుంటున్నారు. లింగమనేని ఇంట్లో చంద్రబాబు అద్దెకు ఉంటే ప్రభుత్వానికి నొప్పి ఏంటని నిలదీస్తున్నారు. మరి అధికారంలో ఉన్నప్పుడు లింగమనేని ఇంటిని భూసమీకరణలో ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని చంద్రబాబు ఎలా ప్రకటించారు. ఆ భవనం అక్రమ కట్టడమే అయినా అవసరాల దృష్ణ్యా తాను అందులో ఉంటున్నట్లు చంద్రబాబే చెప్పారు.
ఆ భవనం ప్రభుత్వానిది కాబట్టే తాను ఉంటున్నానని లేకపోతే తాను ఎలా ఉంటానని ఒకటికి పదిసార్లు ఎదురు ప్రశ్నించారు. ఇదే విషయమై తన భవనాన్ని ప్రభుత్వానికి అప్పగించినట్లు లింగమనేని ప్రకటించారు. అంటే చంద్రబాబు, లింగమనేని చెప్పినట్లు కరకట్టమీద ఉన్న అక్రమ నిర్మాణం ప్రభుత్వ సొంతం. మరిప్పుడు అదే భవనాన్ని జప్తుచేసేందుకు ప్రభుత్వం నోటీసిస్తే ధూళిపాళ్ళ నరేంద్ర, బుద్ధా వెంకన్న లాంటి తెలుగు తమ్ముళ్ళు ఎందుకంత గోలచేస్తున్నారు..? పైగా ఆ భవనం చంద్రబాబుది కాదని లింగమనేనిదని ఎలా అడ్డంగా అబద్ధాలు చెబుతున్నారు..?
ధూళిపాళ్ళ చెబుతున్నట్లు నిజంగా భవనం లింగమనేనిదే అయితే అందులో ఉండేందుకు అనుమతి కోరుతూ ప్రభుత్వానికి చంద్రబాబు లేఖలు రాస్తున్నట్లు ఎలా చెప్పారు..? అధికారిక నివాసంగా ప్రకటించాలని 2019 నుండి లేఖలు రాస్తుంటే ప్రభుత్వం స్పందించటం లేదన్నారు. భవనం లింగమనేనిది అయితే చంద్రబాబు అందులో ఉండేందుకు ప్రభుత్వం అనుమతి కోరాల్సిన అవసరం ఏమిటో ధూళిపాళ్ళ చెప్పాలి. భవనం ప్రభుత్వానిది కాబట్టే ఉండేందుకు అనుమతి కోరుతూ ప్రభుత్వానికి చంద్రబాబు లేఖలు రాస్తున్నారు. ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోయినా అందులో చంద్రబాబు ఉంటున్నారంటే అనధికారికంగా ఆ భవనాన్ని తన ఆధీనంలో ఉంచుకున్నట్లే కదా.
అంటే చంద్రబాబు సదరు భవనాన్ని కబ్జా చేసినట్లే లెక్క.. ప్రభుత్వ ఆస్తిని చంద్రబాబు కబ్జాచేయటం నేరమే కదా. పైగా ఆ భవనంలో ఉంటున్నందుకు లింగమనేనికి చంద్రబాబు అద్దె చెల్లిస్తున్నారట. దానికి సంబంధించిన రశీదులు కూడా ఉన్నాయట. అంటే ప్రభుత్వ భవనం అద్దె డబ్బులను లింగమనేని తీసుకుంటున్నారు. ప్రభుత్వానికి అందాల్సిన ఆదాయాన్ని లింగమనేని తీసుకుంటున్నారంటే ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నట్లే కదా.
ఒకవైపు అందులో ఉండేందుకు చంద్రబాబుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి లేఖలు రాస్తున్నట్లు చెప్పిన ధూళిపాళ్ళ.. భవనంలో ఉంటున్నందుకు లింగమనేనికి అద్దె చెల్లిస్తున్నట్లు చెప్పారు. భవనంలో ఉండేందుకు అనుమతించాలని ప్రభుత్వాన్ని అనుమతి అడుగుతూ అద్దె లింగమనేనికి చెల్లించటం ఏమిటో అర్థంకావటంలేదు. భవనం ప్రభుత్వానిదా..? లేకపోతే లింగమనేనిదా..? అన్న విషయంలో అప్పుడే కాదు ఇప్పుడు కూడా చంద్రబాబు అండ్ కో అబద్ధాలే చెబుతున్నారు.