క్రాస్ ఓటింగ్ కోసం నాకు టీడీపీ నుంచి పది కోట్ల ఆఫర్ వచ్చింది... ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సంచలన ఆరోపణలు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో వారి అభ్యర్థికి ఓటు వేస్తే పది కోట్ల రూపాయలు ఇస్తామని తెలుగుదేశం పార్టీ తనకు ఆఫర్ చేసిందని జనసేన నుండి వైసీపీలోకి వెళ్ళిన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఈ రోజు ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్సీ ఎన్నికల రగడ ఇంకా తగ్గడం లేదు. ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీకి క్రాస్ ఓటింగ్ చేయడంతో వైసీపీ అభ్యర్థి కోలా గురువులు ఓడిపోయిన విషయం తెలిసిందే. బలం లేకపోయినప్పటికీ అనూహ్యంగా టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనూరాధ ఎమ్మెల్సీగా గెలిచారు.
ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్న వైసీపీ అధిష్టానం క్రాస్ ఓటింగ్ చేశారంటూ నలుగురు ఎమ్మెల్యేలను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. సస్పెండ్ అయిన వారిలో ఆనం రాం నారాయణ రెడ్డి, కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకల చంద్ర శేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలు ఉన్నారు. వీళ్ళు డబ్బులకు అమ్ముడు పోయారని వైసీపీ ఆరోపించింది. అయితే ఈ నలుగురూ ఆ ఆరోపణను ఖండించారు. డబ్బుకు అమ్ముడుపోయామని నిరూపిస్తే దేనికైనా సిద్దమని సవాల్ విసిరారు.
ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో వారి అభ్యర్థికి ఓటు వేస్తే పది కోట్ల రూపాయలు ఇస్తామని తెలుగుదేశం పార్టీ తనకు ఆఫర్ చేసిందని జనసేన నుండి వైసీపీలోకి వెళ్ళిన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఈ రోజు ఆరోపించారు. ఆయన ఈ విషయాన్ని తన కార్యకర్తలతో మాట్లాడుతూండగా తీసిన వీడియోను ఓ తెలుగు న్యూస్ ఛానల్ ప్రసారం చేసింది.అందులో ఆయన స్పష్టంగా టీడీపీ నుంచి తనకు పది కోట్ల రూపాయల ఆఫర్ వచ్చిందని చెప్పారు. అనంతరం వరప్రసాద్ వివిధ ఛానళ్ళతో మాట్లాడుతూ, తాను చెప్పిన మాటలు నిజమేనని, టీడీపీ ఎమ్మెల్యే మంతెన రామరాజు తనకు ఈ ఆఫర్ ఇచ్చారని సంచలన ఆరోపణలు చేశారు.తమ అభ్యర్థికి ఓటేస్తే టీడీపీ లో మంచి పొజిషన్ ఇస్తామన్నారని, కానీ పది కోట్లు ఇస్తానని ఆయన చెప్పలేదని అన్నారు. అయితే తాను జగన్ నే నమ్ముకున్నానని, ఆయనతోనే నడుస్తానని చెప్పానని, రామరాజు ఆఫర్ ను తిరస్కరించానని వరప్రసాద్ తెలిపారు.
మరో వైపు వరప్రసాద్ ఆరోపణలను టీడీపీ ఎమ్మెల్యే రామరాజు ఖండించారు. తాను రాపాకకు ఎలాంటి ఆఫర్ ఇవ్వలేదని అన్నారు. తాను అసలు రాపాకను ఎప్పుడూ విడిగా కలవలేదని ఆయన అన్నారు.
ఇక ఈ అంశంపై వైసీపీ, టీడీపీ అధిష్టానాలు ఎలా స్పందిస్తాయో .చూడాలి. దీనిపై ప్రభుత్వం విచారణకు ఆదేశించే అవకాశం ఉందనే వాదన వినపడుతోంది.