జనసేన ప్రచారాన్ని.. జబర్దస్త్ కామెడీ చేసేశారుగా..
వైసీపీలో పని చేసి జగన్ ఎస్వీబీసీ ఛైర్మన్ లాంటి ప్రతిష్టాత్మక పదవినిచ్చినా చిల్లర వేషాలతో దాన్ని పోగొట్టుకున్న బాలిరెడ్డి పృథ్వీరాజ్ అలియాస్ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ ఇంకా కామెడీ చేస్తున్నారు.
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాజకీయాల్ని సినిమాలాగానే భావిస్తుంటారు. మెలోడ్రామాలు, ఎమోషనల్ స్పీచ్‌లు, గుండెలు బాదుకోవడాలు, మాటల మధ్యలో తలఎగరేయడాలు అంతా సినిమాటిక్. రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారంలో ఎంతో కీలకంగా భావించే స్టార్ క్యాంపెయినర్ల జాబితాను కూడా జబర్దస్త్ కమెడియన్లతో నింపేసిన పవన్ ప్రచారాన్ని కూడా కామెడీ షోలా మార్చేశారు. దీంతో ఆ పార్టీ శ్రేణుల్లోనే వ్యతిరేకత కనిపిస్తోంది.
లక్ష మెజార్టీ వస్తుందంటున్న హైపర్ ఆది
పిఠాపురంలో పవన్ కళ్యాణ్‌కు లక్ష మెజార్టీ వస్తుందని చెప్పుకొస్తున్నారు ఆ పార్టీ స్టార్ క్యాంపెయినర్, జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది. 2 లక్షల 35వేల ఓట్లున్న పిఠాపురంలో లక్ష ఓట్ల మెజార్టీ రావాలంటే పవన్ కళ్యాణ్‌కు ఎన్ని ఓట్లు రావాలి? లక్షన్నర ఓట్లన్నా రావాలేమో కదా! మరి రెండుచోట్ల ఓడిపోయి నియోజకవర్గాలు మారిపోయి పోటీచేస్తున్న పవన్‌కే అన్ని ఓట్లొస్తే అక్కడ ముప్పై ఏళ్లకు పైగా రాజకీయాల్లో ఉన్న సీనియర్ నేత, వైసీపీ అభ్యర్థి వంగా గీతకు ఎన్ని ఓట్లు వస్తాయి అన్న సోయి కూడా ఆదికి లేదు. పైగా ఆయన పదేపదే అదేమాట రిపీట్ చేస్తుండటం జనసేన శ్రేణుల్లోనే చిరాకు తెప్పిస్తోంది.
జగన్ స్ట్రీట్‌కు ఒక్కడట.. పవన్ స్టేట్‌కు ఒక్కడట!
ఇక వైసీపీలో పని చేసి జగన్ ఎస్వీబీసీ ఛైర్మన్ లాంటి ప్రతిష్టాత్మక పదవినిచ్చినా చిల్లర వేషాలతో దాన్ని పోగొట్టుకున్న బాలిరెడ్డి పృథ్వీరాజ్ అలియాస్ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ ఇంకా కామెడీ చేస్తున్నారు. జగన్ లాంటి నాయకులు వీధికొకరు ఉంటారట.. అదే పవన్ కళ్యాణ్ లాంటి నాయకులు స్టేట్‌కు ఒక్కరే ఉంటారట! ప్రజాసమస్యలపై అసెంబ్లీలో గళమెత్తే నాయకుడు పవనేనట! కానీ ఆయనింకా అసెంబ్లీలో అడుగేపెట్టలేదన్న సంగతి పృథ్వీ మర్చిపోయాడా పాపం! ఈ క్యాంపయినర్లు కామెడీతో జనసేన ప్రచారం జబర్దస్త్ షోలా మార్చేస్తున్నారని జనసైనికులు వాపోతున్నారు.