ఖమ్మం బీఆరెస్ సభకు ఏపీ నుంచి వందలాది వాహనాల్లో జనం
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్య పేట, నందిగామ, కంచికచర్ల, తిరువూరు, ఏ.కొండూరు, గంపల గూడెం, మైలవరం, జీ. కొండూరు, ఏలూరు జిల్లా నూజివీడు, జంగారెడ్డి గూడెం ప్రాంతాల నుండి ప్రజలు పెద్ద ఎత్తున కదిలి వెళ్తున్నట్టు సమాచారం.
ఈ రోజు ఖమ్మంలో ప్రతిష్టాత్మకంగా జరపతలపెట్టిన భారత రాష్ట్ర సమితి బహిరంగ సభకు ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నారు. ప్రధానంగా ఎన్టీఆర్ జిల్లా, ఏలూరు జిల్లా, గుంటూరు జిల్లా నుంచి పెద్ద ఎత్తున ప్రజలు వెళ్తున్నారు.
ప్రజలు వెళ్ళడానికి ఏపీ బీఆరెస్ విజయవాడ జోన్ ఆర్టీసీ నుంచి 150 ఆర్టీసీ బస్సులను అద్దెకు తీసుకున్నట్టు సమాచారం. ఇందులో ఎన్టీఆర్ జిల్లానుండి 105 బస్సుల్లో జనం బయలు దేరగా,ఏలూరు జిల్లా నుండి 45 బస్సుల్లో ప్రజలు బయలు దేరారు. ఒక్క విజయవాడ నుండే 70 బస్సుల్లో జనం బయలు దేరారు.
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్య పేట, నందిగామ, కంచికచర్ల, తిరువూరు, ఏ.కొండూరు, గంపల గూడెం, మైలవరం, జీ. కొండూరు, ఏలూరు జిల్లా నూజివీడు, జంగారెడ్డి గూడెం ప్రాంతాల నుండి ప్రజలు పెద్ద ఎత్తున కదిలి వెళ్తున్నట్టు సమాచారం.
ఇక గుంటూరు నుంచి బీఆర్‌ఎస్ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో ఖమ్మం బయలుదేరారు. ఏపీ బీఆర్‌ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ఆధ్వర్యంలో గుంటూరు నుంచి 250 కార్లలో కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు ఖమ్మం బయలు దేరారు.
ఏపీ ప్రజల నుంచి ఊహించినదానికన్నా ఎక్కువ స్పందన రావడం పట్ల బీఆరెస్ నాయకులు ఆనందంగా ఉన్నారు. ఈ రోజు జరగనున్న ఖమ్మం బీఆరెస్ సభ గురించి తోట చంద్రశేఖర్ కొద్ది రోజులుగా ఏపీలోని పలు జిల్లాల్లో విస్త్రుతంగా పర్యటించి ప్రచారం చేశారు.