Telugu Global
Andhra Pradesh

కొండ నిండినది.. శ్రీవారి దర్శనానికి 48 గంటలు..

దీంతో ఈనెల 21 వరకు ప్రత్యేక దర్శనాలను రద్దు చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. సర్వ దర్శనం క్యూలైన్ తిరుమల గోగర్భం డ్యామ్ వరకు ఉండటం ఇటీవల కాలంలో ఇదే ప్రథమం.

కొండ నిండినది.. శ్రీవారి దర్శనానికి 48 గంటలు..
X

వరుస సెలవులు రావడంతో తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. రద్దీ ఎక్కువ కావడంతో భక్తులు క్యూలైన్లోనే వేచి చూడాల్సిన పరిస్థితి. క్యూలైన్లోకి వెళ్తే 48 గంటల తర్వాతే బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. అంటే క్యూలైన్లోనే రెండురోజులు వేచి చూస్తే కానీ శ్రీవారి దర్శనం అయ్యేలా లేదు. దీంతో ఈనెల 21 వరకు ప్రత్యేక దర్శనాలను రద్దు చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. సర్వ దర్శనం క్యూలైన్ తిరుమల గోగర్భం డ్యామ్ వరకు ఉండటం ఇటీవల కాలంలో ఇదే ప్రథమం.

కరోనా తర్వాత సర్వ దర్శనానికి ఇటీవల టైమ్ స్లాట్ టోకెన్ సిస్టమ్ ఎత్తివేశారు. వచ్చినవారిని వచ్చినట్టు క్యూలైన్లోకి పంపుతున్నారు. ఈ నేపథ్యంలో భక్తులంతా కొండపైకి రాగానే క్యూలైన్లోకి వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. దీంతో సర్వదర్శనం క్యూలైన్ గోగర్భం డ్యామ్ వరకు వచ్చింది. సర్వదర్శనం లైన్లో ఉన్నవారికి దర్శన సమయం 48 గంటలు పడుతోందని చెబుతున్నారు అధికారులు. ఈనెల 20 వరకు రద్దీ కొనసాగే అవకాశముందని అంచనా వేస్తున్నారు.

కరోనా తర్వాత ఇదే అత్యథికం..

కరోనా తర్వాత శ్రీవారి దర్శనాల విషయంలో కొన్నిరోజులు కొవిడ్ నిబంధనలు పాటించారు. కొవిడ్ నెగెటివ్ సర్టిఫికెట్ లేదా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ తప్పనిసరి చేశారు. టికెట్ ఉన్నవారిని మాత్రమే కొండపైకి అనుమతించేవారు. అయితే దూరప్రాంతాల నుంచి వచ్చినవారు టికెట్ ముందుగా బుక్ చేసుకోలేకపోవడంతో కొండకింద పడిగాపులు పడాల్సి వచ్చేది. ఈ అవస్థను దృష్టిలో ఉంచుకుని, టైమ్ స్లాట్ రద్దు చేసి నేరుగా కొండపైకి భక్తులను పంపించేస్తున్నారు. దీంతో రద్దీ మరింత పెరిగింది. తాజాగా వరుస సెలవుల నేపథ్యంలో రద్దీ మరింత ఎక్కువైంది. అవకాశం ఉన్నవారు తిరుమల యాత్రను కొన్నిరోజులపాటు వాయిదా వేసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేసినా ఫలితం లేదు. అందరూ సెలవుల్లో స్వామివారి దర్శనానికి పోటెత్తడం, వివాహాది శుభకార్యాలు కూడా ఎక్కువగా ఉండటంతో తిరుమల కొండ ఇసకేస్తే రాలనంతగా భక్తులతో నిండిపోయింది.

First Published:  14 Aug 2022 10:51 AM IST
Next Story