Telugu Global
Andhra Pradesh

ఏపీలో బీఆర్ఎస్ సంక్రాంతి ఫ్లెక్సీలు.. గోదావరి జిల్లాల్లో గులాబీ రెపరెపలు

కేసీఆర్ అభిమానులు, ఏపీలో సంక్రాంతి సందర్భంగా బీఆర్ఎస్ ఫ్లెక్సీలను భారీగా ఏర్పాటు చేశారు. యానాం, ముమ్మిడివరం, కాకినాడ. కడియం హైవే ప్రాంతాల్లో సంక్రాంతి శుభాకాంక్షలతో గులాబీ రంగు ఫ్లెక్సీలు ఏపీలో బీఆర్ఎస్ క్రేజ్ ని తెలియజేస్తున్నాయి.

ఏపీలో బీఆర్ఎస్ సంక్రాంతి ఫ్లెక్సీలు.. గోదావరి జిల్లాల్లో గులాబీ రెపరెపలు
X

బీఆర్ఎస్ పార్టీ ప్రకటన ముందు నుంచీ ఏపీలో ఫ్లెక్సీల హడావిడి మొదలైంది. పార్టీ ప్రకటన రోజు కూడా విజయవాడ నడిబొడ్డున ఫ్లెక్సీలు వెలిశాయి. ఇప్పుడు సంక్రాంతి సందర్భంగా ఆ సందడి మరింత ఎక్కువైంది. ముఖ్యంగా కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల్లో బీఆర్ఎస్ తరపున భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు నాయకులు. స్థానిక పార్టీలకు ధీటుగా ఫ్లెక్సీలు వెలిశాయంటే ఏపీలో బీఆర్ఎస్ కి ఉన్న క్రేజ్ అర్థం చేసుకోవచ్చు.

క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతం..

తెలంగాణలో బీఆర్ఎస్ కి క్షేత్ర స్థాయిలో మంచి పట్టు ఉంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో కార్యకర్తల బలం ఎక్కువగా ఉన్న పార్టీ బీఆర్ఎస్. జాతీయ పార్టీగా మారిన తర్వాత కేవలం నాయకుల చేరికలతో సరిపెట్టకుండా గ్రౌండ్ లెవల్ లో పార్టీ విస్తరణకోసం కేసీఆర్ ప్రణాళికలు రచించారు. పార్టీ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ఆ ప్రణాళికలను అమలు చేస్తున్నారు. చంద్రశేఖర్ తోపాటు పార్టీలో చేరిన రావెల కిషోర్ బాబు, పార్థసారథి, ప్రకాష్ వంటి నాయకులు బీఆర్ఎస్ విస్తరణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ఏపీ రైతాంగం బీఆర్ఎస్ పట్ల ఆసక్తితో ఉన్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో అమలవుతున్న రైతుబంధు, రైతు బీమా వంటి కార్యక్రమాలపై ఏపీ రైతులకు అవగాహన ఉంది. ఇలాంటి కార్యక్రమాలే ఏపీలో ఉన్నా కూడా ఆ స్థాయిలో రైతులు ఆర్థిక లబ్ధి పొందడం లేదు. కేసీఆర్ ఆలోచనలు, పథకాల ప్రభావం ఏపీలో కూడా కచ్చితంగా కనిపిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

కేసీఆర్ అభిమానులు, ఏపీలో సంక్రాంతి సందర్భంగా బీఆర్ఎస్ ఫ్లెక్సీలను భారీగా ఏర్పాటు చేశారు. యానాం, ఐ.పోలవరం, ముమ్మిడివరం, కాకినాడ భానుగుడి ఫ్లైఓవర్, కొత్తపేట హైవే, కడియం హైవే తదితర ప్రాంతాల్లో సంక్రాంతి శుభాకాంక్షలతో గులాబీ రంగు ఫ్లెక్సీలు బీఆర్ఎస్ క్రేజ్ ని తెలియజేస్తున్నాయి.





బీఆర్ఎస్ ఎంట్రీతో అన్ని పార్టీల్లో గుబులు..

ఏపీలో ముఖ్యంగా కాపు సామాజిక వర్గాన్ని బీఆర్ఎస్ టార్గెట్ చేయడంతో ఆమేరకు టీడీపీ, జనసేన కూటమి విజయావకాశాలకు గండిపడే అవకాశముంది. కాపు ఓట్లకోసమే టీడీపీ, జనసేనను దగ్గరకు తీస్తోంది. ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉన్న కాపు నాయకులు, క్యాడర్ ను ఆ పార్టీవైపు ఆకర్షిస్తున్నారు. ఆమేరకు టీడీపీకి గట్టి ఎదురు దెబ్బ తగులుతుంది, జనసేన నాయకులు పార్టీని వీడి బీఆర్ఎస్ వైపు అడుగులు వేస్తున్నారు. ఒకరకంగా అధికార వైసీపీకి ఇది లాభమే అయినా 175 సీట్లు టార్గెట్ పెట్టుకున్న జగన్ కి బీఆర్ఎస్ ఎంట్రీతో కొన్ని చోట్ల వ్యవహారం తారుమారయ్యే అవకాశముంది. అందుకే అధికార వైసీపీ కూడా బీఆర్ఎస్ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. తాజాగా సంక్రాంతికి ఏపీలో వెలసిన బీఆర్ఎస్ ఫ్లెక్సీలు అన్ని పార్టీల్లోనూ మరోసారి గుబులు పుట్టిస్తున్నాయి.

First Published:  14 Jan 2023 11:45 PM IST
Next Story