సచివాలయాలకు భారీగా నిధులు.. జగన్ కీలక ఆదేశాలు..
ఎమ్మెల్యే సచివాలయాన్ని సందర్శించి వెళ్లిన తర్వాత ప్రతి సచివాలయానికి వాటి పరిధిలో సమస్యల పరిష్కారం కోసం వెంటనే 20లక్షల రూపాయల నిధులు విడుదల చేస్తారు. ఈ బాధ్యతను కలెక్టర్లకు అప్పగించారు.
ఏపీలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయడానికి ఎమ్మెల్యేలందరూ వచ్చారు కాబట్టి, పనిలో పనిగా అందరితో కలిపి సమీక్ష నిర్వహించారు జగన్. రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలకు ఆయన దిశానిర్దేశం చేశారు.
నియోజకవర్గానికి రూ.2 కోట్లు..
ప్రతి ఎమ్మెల్యేకి నియోజకవర్గ అభివృద్ధి కోసం 2 కోట్ల రూపాయలు ఇస్తామని గతంలోనే ప్రకటించారు సీఎం జగన్. దానికి సంబంధించి ఇప్పుడు కీలక ఆదేశాలిచ్చారు, జీవో విడుదల చేశారు. గడప గడపకు మన ప్రభుత్వంలో భాగంగా ఎమ్మెల్యేలు ప్రతి నెల 6, లేదా 7 సచివాలయాలు సందర్శించాలని చెప్పారు. ఎమ్మెల్యే సచివాలయాన్ని సందర్శించి వెళ్లిన తర్వాత ప్రతి సచివాలయానికి వాటి పరిధిలో సమస్యల పరిష్కారం కోసం వెంటనే 20లక్షల రూపాయల నిధులు విడుదల చేస్తారు. ఈ బాధ్యతను కలెక్టర్లకు అప్పగించారు.
క్వాలిటీ ముఖ్యం..
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని మొక్కుబడిగా చేపట్టవద్దని, మనస్ఫూర్తిగా పనిచేయాలని, శ్రద్ధతో పనిచేయాలని సూచించారు సీఎం జగన్. తాను చేయాల్సిందంతా చేస్తున్నానని, ఎమ్మెల్యేలు కూడా దానికి అనుగుణంగా కష్టపడాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరికీ మంచి చేయడాన్ని ధర్మంగా, కర్తవ్యంగా నిర్వహిస్తున్నామని, దానివల్ల ఒక మంచి వాతావరణం ఏర్పడిందని, దాన్ని ముందుకు తీసుకెళ్లడం ఎమ్మెల్యేల బాధ్యత అని చెప్పారు జగన్. గతంలో కన్నా.. మెరుగైన ఫలితాలు సాధించాలన్నారు జగన్. రాష్ట్రంలో లక్షలాది కుటుంబాలు మనమీద ఆధారపడి ఉన్నాయని, వారికి న్యాయం జరగాలంటే.. మనం అధికారంలోకి తిరిగి రావాలన్నారు. రాష్ట్రంలో 87 శాతం కుటుంబాలకు పథకాల ద్వారా లబ్ధి జరిగిందని, వారందరి మద్దతు తీసుకుంటే.. 175కి 175 స్థానాల్లో కచ్చితంగా గెలవగలం అన్నారు జగన్.
గడపగడపకు ఎమ్మెల్యేలు వెళ్లినప్పుడు అక్కడి సమస్యలపై వినతులు తీసుకుని, వాటిని ప్రాధాన్యతా క్రమంలో పెట్టుకోవాలని, చివరిగా ఆ ఏరియా సచివాలయ సందర్శన పూర్తయిన తర్వాత ఆ సచివాలయానికి 20లక్షల రూపాయలు కేటాయిస్తామన్నారు జగన్. నియోజకవర్గ అభివృద్ధికోసం ఇచ్చే 2 కోట్ల రూపాయలు నిధులకు ఇవి అదనం. ఇక గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు అబ్జర్వర్లను కూడా నియమించబోతున్నారు జగన్. 175 నియోజకవర్గాలకు అబ్జర్వర్లను నియమించేందుకు ఆదేశాలిచ్చారు.