Telugu Global
Andhra Pradesh

ఏపీలో కాస్ట్ లీ ఎన్నికలు.. ఇవే సాక్ష్యాలు

ఎన్నికల సమయంలో ఏపీలో మొత్తం 150 చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేశారు. సరిహద్దుల్లో 31 ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ లు, 18 టెంపరరీ చెక్ పోస్ట్ లు ఉన్నాయి.

ఏపీలో కాస్ట్ లీ ఎన్నికలు.. ఇవే సాక్ష్యాలు
X

ఏపీలో ఈసారి ఎన్నికలు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. అదే సమయంలో ఆయా పార్టీల అభ్యర్థులు చావో రేవో తేల్చుకోడానికి రంగంలోకి దిగారు. ప్రలోభాల కోసం కోట్లు ఖర్చు చేశారు. గతంతో పోల్చి చూస్తే ఓటు రేటు పెరిగిందని అంటున్నారు. నోటుతోపాటు మద్యం, ఇతర తాయిలాలు సరేసరి. ఎన్నికల వేళ అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన నగదు, మద్యం, ఇతర తాయిలాల వివరాలు తెలిస్తే ఇవి కాస్ట్ లీ ఎన్నికలు అని నిర్థారణకు రాక తప్పదు. 2019 ఎన్నికల సమయంలో చెక్ పోస్ట్ ల వద్ద పట్టుబడిన నగదు, మద్యంతో పోల్చి చూస్తే ఈసారి వాటి పరిమాణం భారీగా పెరిగింది.

ఎన్నికల సమయంలో ఏపీలో మొత్తం 150 చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేశారు. సరిహద్దుల్లో 31 ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ లు, 18 టెంపరరీ చెక్ పోస్ట్ లు ఉన్నాయి. కౌంటింగ్ పూర్తయ్యే వరకు ఇవి కొనసాగుతాయి. అయితే పోలింగ్ పూర్తి కావడంతో చెక్ పోస్ట్ ల వద్ద పెద్దగా హడావిడి లేదు. పోలింగ్ కి ముందు మాత్రం చెక్ పోస్ట్ ల వద్ద భారీగా నగదు, మద్యం పట్టుబడటం విశేషం. తాజాగా ఈసీ గణాంకాలను బయటపెట్టింది.

2019 ఎన్నికల సమయంలో సీజ్ చేసిన నగదు - రూ.41.80 కోట్లు

2024 ఎన్నికల టైమ్ లో సీజ్ చేసిన నగదు - రూ.107.96 కోట్లు

2019లో పట్టుబడిన మద్యం విలువ - రూ.8.97 కోట్లు

2024లో పట్టుబడిన మద్యం విలువ - రూ.58.70 కోట్లు

2019లో పట్టుబడిన డ్రగ్స్ విలువ - రూ.5.04 కోట్లు

2024లో పట్టుబడిన డ్రగ్స్ విలువ - రూ. 35.61 కోట్లు

2019లో సీజ్ చేసిన బంగారం ఇతర బహుమతుల విలువ -రూ.27.17 కోట్లు

2024లో సీజ్ చేసిన వాటి విలువ - రూ.123.62 కోట్లు

ఈసారి అరెస్ట్ లు కూడా భారీగానే జరిగాయి. అక్రమంగా మద్యం, నగదు, ఇతర వస్తువులు తరలిస్తుండగా మొత్తం 61,543 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. 3,466 వాహనాలు సీజ్ చేశారు. గత ఎన్నికలతో పోల్చి చూస్తే ఈసారి అన్నీ భారీగానే పట్టుబడ్డాయి. నగదు రెట్టింపుని మించిపోయింది. మద్యం విలువ 7 రెట్లు ఎక్కువైంది. డ్రగ్స్ కూడా గతంలోకంటే మరింత ఎక్కువగా రవాణా చేస్తూ చెక్ పోస్ట్ ల్లో దొరికిపోయారు కేటుగాళ్లు. ఇవన్నీ చూస్తే ఈసారి ఎన్నికలు మరింత కాస్ట్ లీ గా మారిపోయాయని తెలుస్తోంది.

First Published:  30 May 2024 1:32 AM GMT
Next Story