టీడీపీ, జనసేనకు ముందుంది అసలు సినిమా
నాణేనికి మరోవైపు చూస్తే వైసీపీలోని అసంతృప్తులను చూసి సంబరపడుతున్న టీడీపీ, జనసేన నేతలు తమ పార్టీల్లో ఎదురవ్వబోయే సమస్యలను మరచిపోయినట్లున్నారు.

అధికారపార్టీలో జరుగుతున్న పరిణామాలతో టీడీపీ, జనసేన నేతలు చాలా హ్యాపీ ఫీలవుతున్నారు. టికెట్ల విషయంలో జగన్మోహన్ రెడ్డి వైఖరితో వైసీపీలో ఎన్నికల నాటికి ముసలం తప్పదని భావిస్తున్నారు. ఆ ముసలమే ఎన్నికల్లో వైసీపీ పుట్టి ముంచేయటం ఖాయమని అంచనాలు వేసుకుంటున్నారు. సుమారు 40 మంది ఎమ్మెల్యేలకు జగన్ టికెట్లు ఇవ్వటంలేదనే ప్రచారం అందరికీ తెలిసిందే. అలాగే కొందరు మంత్రులు, ఎమ్మెల్యేల నియోజకవర్గాలను మార్చుతున్నారు.
మరికొందరు ఎమ్మెల్యేలను ఎంపీలుగా, కొందరు ఎంపీలను ఎమ్మెల్యేలు గానూ పోటీ చేయించబోతున్నారు. అంటే టికెట్లు దక్కని సిట్టింగులు, నియోజకవర్గాలు మారటం ఇష్టంలేని వాళ్ళంతా ఎన్నికల ముందు జగన్ కు ఎదురుతిరగటం ఖాయమని అనుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళవల్ల ఎన్నికల్లో వైసీపీ దెబ్బతినటం ఖాయమని చర్చించుకుంటున్నారు. అయితే ఎంతమందికి టికెట్లు రావటంలేదన్న విషయమై ఇంకా క్లారిటీ రాలేదు. ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే.
సీన్ కట్ చేస్తే నాణేనికి మరోవైపు చూస్తే వైసీపీలోని అసంతృప్తులను చూసి సంబరపడుతున్న టీడీపీ, జనసేన నేతలు తమ పార్టీల్లో ఎదురవ్వబోయే సమస్యలను మరచిపోయినట్లున్నారు. రెండు పార్టీల మధ్య పొత్తు ఫైనల్ అయ్యింది కానీ, ఏ పార్టీ ఎన్నిసీట్లలో పోటీచేయబోయేది, పోటీచేయబోయే నియోజకవర్గాలు ఏమిటన్నది ఫైనల్ కాలేదు. చంద్రబాబు-పవన్ మధ్య లెక్కలు ఫైనల్ అయ్యుంటాయి కానీ, వాటిని బహిరంగంగా ప్రకటించలేదు. సీట్లసంఖ్య, నియోజకవర్గాలను ప్రకటిస్తే అప్పుడుంటుంది అసలు సినిమా. జనసేనకు కేటాయించబోయే సీట్ల సంఖ్యను, నియోజకవర్గాలను అంగీకరించాల్సింది పవన్ కాదు. పార్టీలోని నేతలు, క్యాడర్, పవన్‌కు మద్దతిస్తున్న కాపు సామాజికవర్గంలోని ప్రముఖులు.
ఇప్పటికే చేగొండి హరిరామజోగయ్య లాంటి వాళ్ళు పవన్‌ను తప్పుపడుతున్నారు. చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉంటారన్న లోకేష్ ప్రకటనను చేగొండి తీవ్రంగా ఖండించారు. ఇదే విషయమై చేగొండి సంధించిన ప్రశ్నలకు పవన్ ఇంతవరకు సమాధానం చెప్పలేదు. జనసేనకు కేటాయించబోయే సీట్లు, నియోజకవర్గాల్లో ఏమాత్రం తేడా వచ్చినా కాపులు టీడీపీకి ఎదురు తిరగటం ఖాయం. ఇదే సమయంలో జనసేనకు కేటాయించబోయే సీట్లపై తమ్ముళ్ళల్లో కూడా అసంతృప్తి రేగటం ఖాయం. ఇప్పుడు వైసీపీలోని పరిణామాలను చూసి సంతోషించటం కాదు, రేపు తమ పార్టీల్లోని అసంతృప్తులను చంద్రబాబు, పవన్ ఎలా ఎదుర్కొంటారో చూడాలి.