చంద్రబాబును ఎలా నమ్ముతావు పవన్ కల్యాణ్..?
సీట్ల సర్దుబాటులో కూడా పవన్ కల్యాణ్ నాయకత్వంలోని జనసేనకు తగినన్ని సీట్లు ఇస్తారనే నమ్మకం లేదు. చంద్రబాబు చెప్పినట్లు ఆయన వినాల్సిందే.
టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మార్కు రాజకీయం అందరికీ తెలిసిందే. ఆయన అవసరానికి వాడుకుని వదిలేస్తారు. గతంలో ఇందుకు సంబంధించి పలు ఉదాహరణలున్నాయి. ఎన్టీ రామారావును అన్యాయంగా, మోసపూరితంగా గద్దె దించడానికి తన కుటుంబ సభ్యులను వాడుకుని వదిలేశారు. తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వర రావు, నందమూరి హరికృష్ణ వంటి వారిని తనకు అనుకూలంగా మలుచుకుని ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన తర్వాత వారిని వదిలేశారు. అటువంటి కుట్రపూరితమైన ఆలోచనలు చేసే చంద్రబాబు భవిష్యత్తులో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ను వాడుకుని వదిలేయడనే గ్యారంటీ ఏమీలేదు.
పవన్ కల్యాణ్ పూర్తిగా చంద్రబాబును నమ్ముతున్నట్లు కనిపిస్తున్నారు. ఒక రకంగా త్యాగం చేయడానికి కూడా సిద్ధపడుతున్నారు. చంద్రబాబును జైలులో కలిసి బయటకు వచ్చిన మరుక్షణమే తమ పార్టీ టిడిపితో పొత్తు పెట్టుకుంటుందని ప్రకటించారు. తద్వారా ఆయన చంద్రబాబు చేతులకు చిక్కారు. ఇక ఎన్నికలు ముగిసే వరకు ఆయన కబంధ హస్తాల నుంచి బయటపడలేరు.
సీట్ల సర్దుబాటులో కూడా పవన్ కల్యాణ్ నాయకత్వంలోని జనసేనకు తగినన్ని సీట్లు ఇస్తారనే నమ్మకం లేదు. చంద్రబాబు చెప్పినట్లు ఆయన వినాల్సిందే. కేవలం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై కక్షతో, అక్కసుతో పవన్ కల్యాణ్ టిడిపితో కలిసి నడుస్తున్నారు. బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఏలో కొనసాగుతూనే ఆయన టిడిపితో పొత్తు పెట్టుకున్నారు. పవన్ కల్యాణ్‌కు ఒక విధానమంటూ లేదనే విషయం దానివల్ల అర్థమవుతున్నది.
కాపు సామాజికవర్గంలోని ఒక గ్రూప్ పవన్ కల్యాణ్‌పై ఆశలు పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. చంద్రబాబుతో పొత్తు వల్ల ఆ గ్రూప్ ఆశలు నెరువేరుతాయా అనేది సందేహమే. సీట్ల సర్దుబాటును చంద్రబాబు నానుస్తూ చివరి క్షణంలో ఏం చేస్తారో కూడా తెలియని పరిస్థితి. జనసేనకు 50 నుంచి 60 శాసనసభ సీట్లు ఇవ్వాలని మాజీ ఎంపీ హరిరామ జోగయ్య వంటివారు అంటున్నారు. అది అయ్యే పని కాదని అందరికీ తెలుసు. ఏమైనా చంద్రబాబుతో కలిసి నడవడం వల్ల నష్టపోయేది పవన్ కల్యాణ్ మాత్రమే.