నెగిటివ్ ప్రచారంపై మాత్రమే ఆధారపడితే ఎలా బాబూ..?
తమ కూటమి అధికారంలోకి రావాలనే కోరికను ప్రజల్లో కల్పించడానికి అవసరమైన ప్రాతిపదిక కూడా కూటమి వద్ద లేదు. ఎజెండాను ఖరారు చేసుకుని దాన్ని ప్రజల్లో చర్చకు పెట్టడంలో కూటమి నేతలు పూర్తిగా విఫలమయ్యారు.
టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి నిర్దిష్టమైన ఉమ్మడి కార్యాచరణ లేదు. ఉమ్మడి ఎజెండా లేదు. ఉమ్మడి మేనిఫెస్టో లేదు. ఈ దిశగా నిర్మాణాత్మక ఆలోచన కూటమి నాయకులకు ఉన్నట్లు లేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వ వ్యతిరేకత మీద ఆధారపడి గెలుద్దామనే ఆలోచనలో మాత్రమే కూటమి ఉన్నట్లు అర్థమవుతోంది. టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ బీజేపీని తమ కూటమిలోకి తెచ్చుకోవడానికి పడరాని పాట్లు పడ్డారు. పొత్తు కుదిరింది గానీ బీజేపీ అగ్రనాయకత్వం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల పట్ల పెద్దగా ఆసక్తి కనబరుస్తున్నట్లు లేదు. బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరికి పార్టీ నాయకులు పలువురు సహకరిస్తున్న సూచనలు కనిపించడం లేదు.
ఎన్నికలు ఇంకా నెల రోజులు కూడా లేవు. కూటమి రాష్ట్రంలో పాజిటివ్ ప్రచారంపై గానీ ఉమ్మడి ఎన్నికల ప్రణాళికపై గానీ స్పష్టత ఇవ్వడం లేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద వ్యక్తిగత వ్యాఖ్యలకు పరిమితమవుతున్నారు. రాష్ట్రంలో విధ్వంసం జరిగిందని విమర్శ చేస్తున్నారు. నిర్దిష్టంగా, స్పష్టంగా ప్రభుత్వం చేసిన తప్పులేమిటో చెప్పడంలో కాకలు తీరిన రాజకీయ యోధుడు నారా చంద్రబాబు నాయుడు కూడా విఫలమవుతున్నారు.
తమ కూటమి అధికారంలోకి రావాలనే కోరికను ప్రజల్లో కల్పించడానికి అవసరమైన ప్రాతిపదిక కూడా కూటమి వద్ద లేదు. ఎజెండాను ఖరారు చేసుకుని దాన్ని ప్రజల్లో చర్చకు పెట్టడంలో కూటమి నేతలు పూర్తిగా విఫలమయ్యారు. పీపుల్స్ మేనిఫెస్టో రూపొందిస్తామంటూ ఎన్డీఏ తరఫున అభిప్రాయాలు సేకరిస్తున్నారు. వాట్సప్ కు సూచనలు, సలహాలు పంపించడని కోరుతున్నారు. కానీ అది సరిగా సాగుతున్నట్లు లేదు.
ఉమ్మడి ప్రచారాంశం, నిర్దిష్టమైన ఎజెండా కూటమికి లేదు. ఉమ్మడి మేనిఫెస్టోను ఎప్పుడు ప్రకటిస్తారో తెలియదు. ప్రజల్లోకి దూసుకుని వెళ్లడానికి అవసరమైన పాజిటివ్ ఎజెండా లేకపోవడం పెద్ద వైఫల్యం. కర్ణాటకలో గానీ తెలంగాణలో గానీ కాంగ్రెస్ నిర్దిష్టమైన ఎజెండాతోనే అధికారంలోకి వచ్చింది. కేవలం ప్రభుత్వ వ్యతిరేకత మీద ఆధారపడలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు మాత్రం ప్రస్తుతం తాను అమలు చేస్తున్న పథకాలే కొండంత బలం. దానికి దీటైన పథకాలతో ఎజెండాను రూపొందించి, ప్రచారంలోకి తేవడంలో చంద్రబాబు నాయుడు పూర్తిగా విఫలమయ్యారు.
వలంటీర్లపై తీవ్రమైన ఆరోపణలు చేసి ఆ తర్వాత యూటర్న్ తీసుకున్నారు. చంద్రబాబు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలు మరుగుపడిపోయాయి. అవి చర్చలోకి రావడం లేదు. జగన్ అమలు చేసిన పథకాల కన్నా మెరుగైన పథకాలను ప్రకటించడంలో కూటమి నేతలు విఫలమయ్యారు. దానికితోడు, క్షేత్ర స్థాయిలో, నియోజకవర్గాల స్థాయిలో పార్టీల మధ్య సమన్వయం లేదు. పలు నియోజకవర్గాల్లో ఆ పార్టీలు తీవ్రమైన వ్యతిరేకతను సొంత పార్టీ నుంచే ఎదుర్కుంటున్నాయి. నెగిటివ్ ప్రచారంపై మాత్రమే ఆధారపడి గెలుస్తామని చంద్రబాబు అనుకుంటే అది ఏ మాత్రం ఫలితం ఇవ్వదు.