జగన్ వ్యూహం మామూలుగా లేదుగా?
ఎప్పుడైతే జగన్ మూడు రాజధానుల కాన్సెప్ట్ తెచ్చారో రాజధాని నియోజకవర్గాల్లో గెలుపుపై అనుమానాలు మొదలయ్యాయి. ఇక్కడే జగన్ తన ఆలోచనలకు పదునుపెట్టారు. కొత్తగా ఓటు బ్యాంకును సృష్టించుకుంటే కానీ వైసీపీ గెలుపు సాధ్యంకాదని అర్థమైంది. అందుకనే అమరావతి ప్రాంతంలో 75 వేల మంది పేదలకు ఇళ్ళ పట్టాలు పంపిణీ చేయబోతున్నారు.

జగన్మోహన్ రెడ్డి వ్యూహాలు అంత తొందరగా అర్థంకావు. ఈ విషయం అనేక సందర్భాల్లో చాలామందికి అనుభవమైంది. ఇప్పుడు అమరావతి ప్రాంతంలో పేదలకు ఇళ్ళపట్టాల అంశం కూడా అంతే. పేదలకు అమరావతి ప్రాంతంలో ఇళ్ళ పట్టాలు ఇవ్వాలన్నది జగన్ పట్టుదల. ఎలాగైనా దీన్ని అడ్డుకోవాలన్నది తెలుగుదేశం పార్టీ నేతలు ప్రయత్నాలు. అప్పుడెప్పుడో ‘అన్ని పరిస్థితులు’ అనుకూలించినప్పుడు తమ్ముళ్ళు సక్సెస్ అయ్యారు. అయితే ఆ పరిస్థితులు మారేంతవరకు ఓపికపట్టిన జగన్ తన ప్రయత్నాలను మళ్ళీ మొదలుపెట్టారు.
ఇప్పుడు పరిస్థితులు సానుకూలంగా మారటంతో అమరావతి ప్రాంతంలో పేదలకు ఇళ్ళ పట్టాల పంపిణీకి మార్గం సానుకూలమైంది. రాజధాని ప్రాంతంలో 75 వేలమంది పేదలకు పట్టాల పంపిణీకి ఎందుకింతగా పట్టుబట్టారు? ఎందుకంటే ప్రత్యామ్నాయ ఓటు బ్యాంకును సృష్టించుకోవటమే జగన్ వ్యూహం. రాజధాని ప్రాంతమంటేనే మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాలని తెలిసిందే. 2019 ఎన్నికల్లో రెండు చోట్లా వైసీపీనే గెలిచింది. అయితే ఎప్పుడైతే జగన్ మూడు రాజధానుల కాన్సెప్ట్ తెచ్చారో రాజధాని నియోజకవర్గాల్లో గెలుపుపై అనుమానాలు మొదలయ్యాయి.
ఇక్కడే జగన్ తన ఆలోచనలకు పదునుపెట్టారు. కొత్తగా ఓటు బ్యాంకును సృష్టించుకుంటే కానీ వైసీపీ గెలుపు సాధ్యంకాదని అర్థమైంది. అందుకనే పై రెండు నియోజకవర్గాల పరిధిలో 75 వేలమంది పేదలకు ఇళ్ళపట్టాలు పంపిణీ చేయబోతున్నారు. వీటిల్లో జగనన్న కాలనీలు కూడా కట్టించి ఇవ్వబోతున్నారు. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి పనులు మొదలై జోరందుకోవటం ఖాయం. అంటే జగన్ ప్లాన్ ప్రకారం కొత్తగా సుమారు 2.5 లక్షల ఓట్లు వస్తాయి. 75 వేల కుటుంబాలకు ఇళ్ళ పట్టాలు, ఇళ్ళంటే ఇంటికి మూడు ఓట్లను వేసుకున్నా సుమారు 2.5 లక్షల ఓట్లు.
ఇప్పటికే ఉన్న ఓటర్లలో మెజారిటీ వైసీపీకి వ్యతిరేకంగా వేసినా కొత్తగా తోడయ్యే ఓట్లు వైసీపీకి పడితే చాలు వైసీపీ గెలుపు ఖాయమని జగన్ అనుకుంటున్నారు. అంటే ఇవన్నీ అంచనాలు, వ్యూహాలు మాత్రమే. వాస్తవంగా ఏమి జరుగుతుందనేది కొంతకాలం ఆగితే కానీ తేలదు. జగన్ లెక్కల ప్రకారం కొత్త ఓటర్లను మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాల్లో సర్దబోతున్నారు. కాబట్టి రెండు నియోజకవర్గాల్లోనూ వైసీపీనే గెలుస్తుందని జగన్ నమ్ముతున్నారు. చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.