Telugu Global
Andhra Pradesh

అక్రమ అరెస్టా..? సీసీ టీవీ ఫుటేజీ చూడలేదా..?

పిన్నెల్లిది అక్రమ అరెస్ట్ అని జగన్ అనడం దురదృష్టకరం అని అన్నారు హోం మంత్రి అనిత. సీసీ టీవీ ఫుటేజీని జగన్ చూడలేదా అని ప్రశ్నించారామె.

అక్రమ అరెస్టా..? సీసీ టీవీ ఫుటేజీ చూడలేదా..?
X

నెల్లూరు జిల్లా జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించిన అనంతరం జగన్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారాయి. "ఎల్లకాలం ప్రభుత్వం మీది కాదు, ఎల్లకాలం రోజులు మీవే ఉండవు" అంటూ సీఎం చంద్రబాబుకి ఘాటు హెచ్చరిక చేశారు జగన్. అదే సమయంలో పిన్నెల్లిపై అక్రమ కేసులు పెట్టారని ఆయన మండిపడ్డారు. పిన్నెల్లి మంచి నాయకుడని, అందుకే వరుసగా 4సార్లు మాచర్లలో ఎమ్మెల్యేగా గెలిచారని వివరించారు. ఈవీఎం ధ్వంసం కేసులో ఆయనకు బెయిల్ వచ్చిందని, హత్యాయత్నం కేసులో కావాలనే ఇరికించి జైలుకి పంపించారని మండిపడ్డారు. పిన్నెల్లిపై జగన్ చేసిన వ్యాఖ్యలకు టీడీపీ నుంచి కౌంటర్లు మొదలయ్యాయి. హోం మంత్రి వంగలపూడి అనిత, జగన్ వ్యాఖ్యలపై ఘాటుగా రియాక్ట్ అయ్యారు.

పిన్నెల్లిది అక్రమ అరెస్ట్ అని జగన్ అనడం దురదృష్టకరం అని అన్నారు హోం మంత్రి అనిత. సీసీ టీవీ ఫుటేజీని జగన్ చూడలేదా అని ప్రశ్నించారామె. ఆయన్ను అరెస్ట్ చేయాలని ఏకంగా కోర్టు ఆదేశాలిచ్చిందని, ఆ విషయం జగన్ కి ఎందుకు అర్థం కాలేదని నిలదీశారు. ఇక జైలులో ములాఖత్ కి అనుమతి ఇచ్చే పరిస్థితి లేకపోయినా మానవతా దృక్పథంతో పిన్నెల్లిని కలిసేందుకు జగన్ ని వెళ్లనిచ్చామని చెప్పారు అనిత. గతంలో చంద్రబాబు అరెస్ట్ సందర్భంగా కుటుంబ సభ్యుల్ని కలిసే విషయంలో రూల్స్ పేరుతో ఇబ్బంది పెట్టారని, కానీ తాము అలా చేయలేదని చెప్పుకొచ్చారామె.

రూ. 25లక్షలు ఖర్చు..

జగన్ నెల్లూరు పర్యటనకు హెలికాప్టర్లో వచ్చారని, 25లక్షల రూపాయలు ఖర్చు అయి ఉంటుందని సెటైర్లు వేశారు హోం మంత్రి అనిత. ఓ ఖైదీని కలవడానికి వచ్చేందుకు అంత ఖర్చు పెట్టాలా అని ప్రశ్నించారు. తప్పు చేసి జైలులో ఉన్న వ్యక్తిని కలవడమే కాకుండా, ఆయన అమాయకుడు, మంచివాడంటూ జగన్ సర్టిఫికెట్ ఇవ్వడం మరీ దారుణం అని విమర్శించారు. ఘర్షణ వాతావరణం సృష్టించేందుకే జగన్ నెల్లూరు వెళ్లారని అన్నారు హోం మంత్రి అనిత.

First Published:  4 July 2024 11:11 AM GMT
Next Story