ఆరడుగుల స్థలం కోసం వందలమంది గోడలు దూకారు
అయ్యన్నను అంతగా వేధించారు కాబట్టే.. ఆయన స్పీకర్ గా వచ్చారని తెలియగానే జగన్ భయపడి అసెంబ్లీకి రాలేదని ఎద్దేవా చేశారు హోం మంత్రి అనిత.
ప్రతీకార రాజకీయాలంటూ వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలకు సమాధానమిచ్చారు హోం మంత్రి వంగలపూడి అనిత. అప్పట్లో రాజకీయాలు ఎలా ఉన్నాయో ఆమె వివరించారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఇంటి ప్రహరీ గోడ ఆక్రమణ అంటూ ఏకంగా పోలీస్ బెటాలియన్ ని దింపారని గుర్తు చేశారు అనిత. ఆరడుగుల స్థలం కోసం వందలమంది పోలీసుల్ని గోడ దూకించారని చెప్పారు. గత ప్రభుత్వంలో అయ్యన్నపాత్రుడిని ఎన్నో ఇబ్బందులు పెట్టాలని చూశారన్నారు. ఆయనతోపాటు చాలామంది టీడీపీ నేతలు అప్పట్లో రాజకీయ ప్రతీకార దాడులతో సతమతం అయ్యారని చెప్పారు అనిత.
ఆయనంటే భయం..
అయ్యన్నను అంతగా వేధించారు కాబట్టే.. ఆయన స్పీకర్ గా వచ్చారని తెలియగానే జగన్ భయపడి అసెంబ్లీకి రాకుండా పారిపోయారని ఎద్దేవా చేశారు హోం మంత్రి అనిత. చివరకు ప్రతిపక్షహోదా కోసం ఆయన్నే జగన్ భిక్ష అడగాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్ కాక ఇంకేంటని ప్రశ్నించారు అనిత.
రెడ్ బుక్..
కూటమి ప్రభుత్వంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని వైసీపీ విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. బహిరంగంగానే రెడ్ బుక్ లో పేర్లున్నాయంటూ టీడీపీ నేతలు హెచ్చరిస్తున్నారని కూడా వారు ఆరోపిస్తున్నారు. ఆ బుక్ ప్రకారమే రాజకీయ ప్రతీకార దాడులు జరుగుతున్నాయని అంటున్నారు. అయితే రెడ్ బుక్ తనకంటే అయ్యన్నపాత్రుడు వద్ద ఉంటేనే బాగుండేదని చెప్పుకొచ్చారు హోం మంత్రి అనిత. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడి సన్మాన సభలో ఆమె ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.