Telugu Global
Andhra Pradesh

`టైగర్ నాగేశ్వరరావు` సినిమా టీజ‌ర్‌పై హైకోర్టు ఘాటు వ్యాఖ్య‌లు

`టైగర్ నాగేశ్వరరావు` చిత్ర నిర్మాత అభిషేక్ అగ‌ర్వాల్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ముంబైలోని సెంట్రల్ బోర్డ్‌ ఫిల్మ్ సర్టిఫికేషన్ చైర్‌ప‌ర్స‌న్ ను కూడా ఈ వ్యాజ్యంలో ప్రతివాదిగా చేర్చాలని పిటిషనర్‌కు సూచించింది.

`టైగర్ నాగేశ్వరరావు` సినిమా టీజ‌ర్‌పై హైకోర్టు ఘాటు వ్యాఖ్య‌లు
X

`టైగర్ నాగేశ్వరరావు` సినిమా టీజ‌ర్ విష‌యంలో ఏపీ హైకోర్టు ఘాటు వ్యాఖ్య‌లు చేసింది. టీజర్లో వాడిన పదప్రయోగం ఓ సామాజిక వర్గాన్ని, స్టువర్ట్‌పురం ప్రాంత వాసులను అవమానించేదిగా ఉందని ఉన్న‌త న్యాయ‌స్థానం వ్యాఖ్యానించింది. సెంట్రల్ బోర్డు ఫిల్మ్ సర్టిఫికెట్ లేకుండా టీజర్ ఎలా విడుదల చేస్తారని అభ్యంతరం తెలిపింది. సమాజం పట్ల బాధ్యతగా ఉండొద్దా? అని సినీ నిర్మాణ సంస్థను ప్ర‌శ్నించింది. ఇలాంటి టీజర్ ద్వారా సమాజానికి ఏమి సందేశం ఇవ్వాలనుకుంటున్నారని న్యాయ‌స్థానం నిల‌దీసింది.

నిర్మాత‌కు నోటీసులు

`టైగర్ నాగేశ్వరరావు` చిత్ర నిర్మాత అభిషేక్ అగ‌ర్వాల్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ముంబైలోని సెంట్రల్ బోర్డ్‌ ఫిల్మ్ సర్టిఫికేషన్ చైర్‌ప‌ర్స‌న్ ను కూడా ఈ వ్యాజ్యంలో ప్రతివాదిగా చేర్చాలని పిటిషనర్‌కు సూచించింది. అభ్యంతరాలపై చైర్‌ప‌ర్స‌న్‌కు ఫిర్యాదు చేసుకునేందుకు పిటిషనర్‌కు వెసులుబాటు ఇచ్చింది. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, జస్టిస్ ఏవీ శేషసాయితో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది. `టైగర్ నాగేశ్వరరావు` సినిమా ఎరుకల సామాజికవర్గ మనోభావాలను కించపరిచేదిగా ఉందని, స్టువర్టుపురం గ్రామ ప్రజల ప్రతిష్ట‌కు భంగం కలిగించేలా ఉందంటూ చుక్కా పాల్‌రాజ్ హైకోర్టులో పిల్ వేశారు. బుధవారం దీనిపై విచార‌ణ చేప‌ట్ట‌గా, పిటిషనర్ తరఫున న్యాయవాదులు అంకాళ్ల పృథ్వీరాజ్, శృంగారపాటి కార్తీక్ వాదనలు వినిపించారు.

First Published:  31 Aug 2023 5:10 AM GMT
Next Story