Telugu Global
Andhra Pradesh

ఏపీ రాజధాని గోలపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు

ఇప్పటికే ఈ వ్యవహారం సుప్రీం కోర్టుకు చేరింది కదా.. అక్కడ తీర్పు వచ్చే వరకైనా ఎందుకు సంయమనం పాటించడం లేదని హైకోర్టు ప్రశ్నించింది. ఇవన్నీ రాజకీయ ప్రేరేపిత కార్యక్రమాలుగా కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించింది.

ఏపీ రాజధాని గోలపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
X

ఏపీలో అమరావతి వర్సెస్ మూడు రాజధానులుగా సాగుతున్న పోరాటాలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కోర్టు తీర్పు తర్వాత కూడా ఈ పోటాపోటీ కార్యక్రమాలు ఏమిటని ప్రశ్నించింది. అమరావతి రైతుల పాదయాత్రలో పాల్గొనేందుకు తమకూ అవకాశం ఇవ్వాలంటూ రైతాంగ సమాఖ్య పిటిషన్ వేసింది. రైతుల తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఆదినారాయణరావు వాదనలు వినిపించారు. పాదయాత్రకు సంఘీభావం తెలిసే హక్కును ప్రభుత్వం హరిస్తోందని వాదించారు. దీంతో జోక్యం చేసుకున్న హైకోర్టు.. రాజధాని అమరావతిలోనే ఉండాలని హైకోర్టు ఇదివరకే స్పష్టమైన తీర్పు ఇచ్చిన తర్వాత తిరిగి పాదయాత్రలు చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించింది.

అందుకు రైతుల తరపు న్యాయవాది స్పందిస్తూ... హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో ర్యాలీలు, రౌండ్ టేబుల్ సమావేశాలు, సభలు నిర్వహిస్తోందని, మంత్రుల చేత ప్రకటనలు ఇప్పిస్తోందని.. అలాంటప్పుడు అమరావతివాదులు కూడా తమ ఆకాంక్షను తెలిపేందుకు పాదయాత్ర చేస్తే తప్పేముందని వాదించారు. దాంతో తిరిగి జోక్యం చేసుకున్న న్యాయమూర్తి... హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ప్రభుత్వం ర్యాలీలు, సమావేశాలు నిర్వహించడం,.. అమరావతివాదులు పాదయాత్ర చేయడం రెండు సరికాదని వ్యాఖ్యానించింది.

ఇప్పటికే ఈ వ్యవహారం సుప్రీం కోర్టుకు చేరింది కదా.. అక్కడ తీర్పు వచ్చే వరకైనా ఎందుకు సంయమనం పాటించడం లేదని కోర్టు ప్రశ్నించింది. ఇవన్నీ రాజకీయ ప్రేరేపిత కార్యక్రమాలుగా కనిపిస్తున్నాయని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇలాంటి కార్యక్రమాల ద్వారా కోర్టులపై ఒత్తిడి తేవాలనుకుంటున్నారా అని ప్రశ్నించింది. అసలు ఈ వ్యవహారంతో సంబంధం లేని రైతాంగ సమాఖ్య పిటిషన్ వేయడం ఏమిటని కోర్టు ప్రశ్నించగా... తమకు సంఘీభావం తెలిపే అవకాశం లేకుండా పోయిందని, తమ ప్రాథమిక హక్కును కాపాడాల్సిందిగా కోరేందుకే పిటిషన్ వేశామని పిటిషనర్ తరపు న్యాయవాది వివరించారు. ఈ పిటిషన్ విచారణ అర్హతపై ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. దీనిపై సవివరంగా కౌంటర్ దాఖలు చేస్తామని చెప్పింది. దాంతో తదుపరి విచారణను సోమవారానికి కోర్టు వాయిదా వేసింది.

First Published:  2 Nov 2022 2:54 PM IST
Next Story