Telugu Global
Andhra Pradesh

టీవీ5 చైర్మన్‌కు నోటీసులపై హైకోర్టు స్టే

శనివారం చానల్ చైర్మన్ బీఆర్‌ నాయుడుకి కూడా నోటీసులు జారీ చేసింది సీఐడీ. అది కూడా దీపావళి రోజైన సోమవారమే హాజరు కావాలని నోటీసులు ఇచ్చింది.

టీవీ5 చైర్మన్‌కు నోటీసులపై హైకోర్టు స్టే
X

ఏపీ సీఐడీకి న్యాయస్థానాల్లో వరుసగా ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. కక్షపూరితంగానే సీఐడీ వ్యవహరిస్తోందేమో అన్న సంకేతాలు ఇచ్చేలా దర్యాప్తు సంస్థ పనితీరు ఉండడం కూడా నిందితులకు కలిసి వస్తోంది. కరోనా సమయంలో డాక్టర్లకు రక్షణ ఏది? అంటూ టీవీ5లో ప్రసారమైన కథనంపై రెండున్నరేళ్ల క్రితమే కేసు నమోదు అయింది. ఈ కేసులో ఇప్పటికే టీవీ5లోని కీలక ఉద్యోగులకు నోటీసులు జారీ అయ్యాయి.

శనివారం చానల్ చైర్మన్ బీఆర్‌ నాయుడుకి కూడా నోటీసులు జారీ చేసింది సీఐడీ. అది కూడా దీపావళి రోజైన సోమవారమే హాజరు కావాలని నోటీసులు ఇచ్చింది. దీన్ని ఆసరాగా చేసుకుని బీఆర్‌ నాయుడు హైకోర్టులో హౌస్ మోషన్ దాఖలు చేశారు. రోజువారీ వార్తల ప్రసారంతో చైర్మన్‌కు ఎలాంటి సంబంధం ఉండదని అయినా సరే కక్షపూరితంగా నోటీసులు ఇచ్చారని టీవీ5 బీఆర్‌ నాయుడు తరపు న్యాయవాది వాదించారు.

పైగా అమరావతిలో కేసు పెట్టి విచారణకు విశాఖలో హాజరు కావాల్సిందిగా చెప్పడం ఏమిటని వాదించారు. పండుగ పూటే హాజరు కావాలని చెప్పడం కేవలం కక్షపూరిత చర్యల్లో భాగమేనని ఆరోపించారు. ఇందుకు స్పందించిన హైకోర్టు.. పండుగ రోజే విచారణకు రావాల్సిందిగా నోటీసులు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించింది. సీఐడీ జారీ చేసిన నోటీసులపై స్టే ఇచ్చేసింది. తదుపరి విచారణను నవంబర్‌ 8కి వాయిదా వేశారు న్యాయమూర్తి. పండుగ రోజే విచారణకు రావాల్సిందిగా రెండున్నరేళ్ల క్రితం నాటి కేసులో సీఐడీ నోటీసులు ఇవ్వడంతో హైకోర్టు కూడా కక్షపూరిత చర్యగా భావించేందుకు ఆస్కారం ఏర్పడింది.

First Published:  25 Oct 2022 9:56 AM IST
Next Story