Telugu Global
Andhra Pradesh

హెల్మెట్‌ నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలి.. - రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

హెల్మెట్‌ ధరించాల్సిన అవసరం, ధరించకపోతే సంభవించే దుష్ప్రభావాలపై బైక్‌లు నడిపేవారిలో అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని పోలీసులను, న్యాయ సేవాధికార సంస్థను ధర్మాసనం ఆదేశించింది.

హెల్మెట్‌ నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలి.. - రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
X

రాష్ట్రంలో హెల్మెట్‌ నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని ఏపీ హైకోర్టు ప్రభుత్వాన్ని, పోలీసులను ఆదేశించింది. ఈ విషయంలో చట్ట నిబంధనలను తూచా తప్పకుండా అమలు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్, న్యాయమూర్తి నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. హెల్మెట్‌ ధరించకపోవడాన్ని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా హైకోర్టు అభిప్రాయపడింది. ఈ విషయంలో ఏ ఒక్కరినీ ఉపేక్షించరాదని స్పష్టం చేసింది.

హెల్మెట్‌ ధరించకపోవడం వల్ల సంభవిస్తున్న మరణాలను దృష్టిలో పెట్టుకుని ద్విచక్ర వాహన చోదకులు తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించేలా చర్యలు చేపట్టాలని ధర్మాసనం ఆదేశించింది. కేంద్ర మోటారు వాహన సవరణ చట్ట నిబంధనలను అమలు చేసేందుకు ఏం చర్యలు తీసుకున్నారో వివరించాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని చెప్పింది. తదుపరి విచారణను ఆగస్టు 21వ తేదీకి వాయిదా వేసింది.

హెల్మెట్‌ ధరించాల్సిన అవసరం, ధరించకపోతే సంభవించే దుష్ప్రభావాలపై బైక్‌లు నడిపేవారిలో అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని పోలీసులను, న్యాయ సేవాధికార సంస్థను ధర్మాసనం ఆదేశించింది. చట్ట నిబంధనల గురించి ప్రాంతీయ, జాతీయ భాషా పత్రికల్లో ప్రకటనలు ఇవ్వాలని తెలిపింది. రోడ్లపై విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు తప్పనిసరిగా బాడీఓర్న్‌ కెమెరాలు ధరించాల్సిన అవసరం ఉందని తెలిపింది. ఈ దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పింది. తద్వారా చట్ట ఉల్లంఘనలకు పాల్పడిన వారికి వ్యతిరేకంగా సాక్ష్యాలను కోర్టు ముందుంచి వారికి శిక్ష పడేలా చేయొచ్చని తెలిపింది. ఈ వ్యవహారం విస్తృత ప్రజా ప్రయోజనాలకు సంబంధించినదని, దీనిని సీరియస్‌గా తీసుకోవాలని ప్రభుత్వానికి, పోలీసులకు స్పష్టం చేసింది. చట్ట ఉల్లంఘనలకు పాల్పడిన వారికి విధించిన చలాన్ల వివరాలను, వాహన తనిఖీల వివరాలను తమ ముందుంచాలని ఈ సందర్భంగా ధర్మాసనం ఆదేశించింది.

First Published:  27 Jun 2024 8:37 AM IST
Next Story