తుది జాబితా ప్రకటించవద్దు - టీచర్ల బదిలీపై హైకోర్టు
పిటిషనర్లు లేవనెత్తిన అభ్యంతరాలను పరిష్కరించేందుకు కోర్టు అవకాశం ఇచ్చినా ఉన్నతాధికారులు సద్వినియోగం చేసుకోలేకపోయారని కోర్టు వ్యాఖ్యానించింది.
ఏపీలో టీచర్ల బదిలీ మార్గదర్శకాలపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ కేసును లోతుగా విచారిస్తామని ప్రకటించింది. అప్పటి వరకు బదిలీలకు సంబంధించిన తుది జాబితాను ప్రకటించవద్దని ఆదేశించింది. బదిలీల మార్గదర్శకాలను అధికారులు కేవలం యాంత్రికంగా తయారు చేసినట్టుగా ఉందని కోర్టు వ్యాఖ్యానించింది.
గతంలో ఒకసారి ప్రాధాన్యత కేటగిరి కింద బదిలీల్లో లబ్ది పొందిన వారికి మరోసారి ప్రాధాన్యత వర్తించదని చెప్పడాన్ని కోర్టు తప్పుపట్టింది. ప్రాధాన్యత కేటగిరి కింద గుర్తించాలంటే 70 శాతం అంగవైకల్యం ఉండాలన్న నిబంధనను కోర్టు తప్పుపట్టింది. పాఠశాలల నూతన మ్యాపింగ్ కారణంగా తప్పనిసరిగా బదిలీ కావాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు సదరు టీచర్లందరికీ ప్రత్యేక పాయింట్లు కేటాయించాల్సిందేనని స్పష్టం చేసింది.
పిటిషనర్లు లేవనెత్తిన అభ్యంతరాలను పరిష్కరించేందుకు కోర్టు అవకాశం ఇచ్చినా ఉన్నతాధికారులు సద్వినియోగం చేసుకోలేకపోయారని కోర్టు వ్యాఖ్యానించింది. కాబట్టి ఈ కేసును లోతుగా విచారించి తామే నిర్ణయం తీసుకుంటామని చెప్పింది. జనవరి 4లోపు పూర్తి వివరాలతో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. తాను నిర్ణయం వెల్లడించే వరకు బదిలీల తుది జాబితాను ప్రకటించవద్దని హైకోర్టు ఆదేశించింది.