Telugu Global
Andhra Pradesh

జడ్జిలపై అభ్యంతరకర పోస్టులు.. హైకోర్టు సీరియస్‌ - టీడీపీ నేతలు సహా 26 మందికి నోటీసులు

వీరిపై క్రిమినల్‌ కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలని కోరుతూ అడ్వకేట్‌ జనరల్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తులు జస్టిస్‌ చీకటి మానవేంద్రనాథ్‌ రాయ్, జస్టిస్‌ తర్లాడ రాజశేఖరరావులతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది.

జడ్జిలపై అభ్యంతరకర పోస్టులు.. హైకోర్టు సీరియస్‌  - టీడీపీ నేతలు సహా 26 మందికి నోటీసులు
X

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణంలో తనపై నమోదైన కేసు కొట్టేయాలంటూ చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేయగా, అందుకు అంగీకరించని హైకోర్టు చంద్రబాబు పిటిషన్‌ను కొట్టేసిన విషయం తెలిసిందే. ఈ తీర్పునిచ్చిన హైకోర్టు న్యాయమూర్తులతో పాటు ఏసీబీ న్యాయాధికారి లక్ష్యంగా టీడీపీ శ్రేణులు సోషల్‌ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టడాన్ని హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. దీనికి సంబంధించి పలువురు టీడీపీ నాయకులతో పాటు మొత్తం 26 మందికి నోటీసులు జారీ చేసింది. వీరిపై క్రిమినల్‌ కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలని కోరుతూ అడ్వకేట్‌ జనరల్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తులు జస్టిస్‌ చీకటి మానవేంద్రనాథ్‌ రాయ్, జస్టిస్‌ తర్లాడ రాజశేఖరరావులతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది.

ఈ పిటిషన్‌లో ప్రతివాదులుగా ఉన్న టీడీపీ నేతలు బుద్దా వెంకన్న, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, సస్పెన్షన్‌లో ఉన్న న్యాయాధికారి ఎస్‌.రామకృష్ణతో పాటు మువ్వా తారక్‌ కృష్ణ యాదవ్, రవికుమార్‌ ముదిరాజ్, రుమాల రమేష్, యల్లారావు, కళ్యాణి, ఎన్‌.చిరంజీవి, చైతన్య కుమార్‌ రెడ్డి, ఆనంద్, కిషోర్‌ కుమార్‌ తదితరులకు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. అదే క్రమంలో గూగుల్‌ ఇండియా, ట్విటర్‌ (ఎక్స్‌) కమ్యూనికేషన్స్, ఫేస్‌బుక్‌ ఇండియాలకు కూడా నోటీసులు జారీ చేసింది. అసభ్యకర, అభ్యంతరకర పోస్టులు, కామెంట్లు పెట్టినందుకు వారిపై ఎందుకు ధిక్కార చర్యలు తీసుకోరాదో వివరించాలని ఆదేశించింది. అంతేకాదు.. న్యాయమూర్తులు, న్యాయాధికారిపై పోస్టులు పెట్టిన ప్రతివాదుల ఫేస్‌బుక్‌ అకౌంట్ల అసలు యజమానులను గుర్తించాలని, వారికి నోటీసులు జారీ చేయాలని డీజీపీని ఆదేశించింది. తమ ఉత్తర్వులు అమలయ్యేలా చూడాలని రిజిస్ట్రీని ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్‌ 25కి వాయిదా వేసింది.

స్కిల్‌ స్కామ్‌లో చంద్రబాబు వేసిన‌ క్వాష్‌ పిటిషన్‌ను విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ శ్రీనివాసరెడ్డి దానిని కొట్టేశారు. ఈ నేపథ్యంలో ఏసీబీ కోర్టు న్యాయాధికారితో పాటు జస్టిస్‌ శ్రీనివాసరెడ్డి, మరో న్యాయమూర్తి జస్టిస్‌ సురేష్‌ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని టీడీపీ నేతలు నేతలు, ఇతరులు సోషల్‌ మీడియాలో అసభ్యకర, అభ్యంతరకర పోస్టులు, కామెంట్లు పెద్ద ఎత్తున పెట్టారు. వారిని కులం పేరుతో దూషించారు. ఈ విషయాన్ని న్యాయవాది డాక్టర్‌ వసంత్‌ కుమార్‌ లిఖితపూర్వకంగా ఏజీ ఎస్‌.శ్రీరామ్‌ దృష్టికి తీసుకొచ్చారు. హైకోర్టు న్యాయవాది ఎం.సుజాత సైతం ఇదే విషయంపై ఏజీకి లేఖ రాశారు. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలను కూడా ఆ లేఖకు జత చేశారు. న్యాయవ్యవస్థ ప్రతిష్టను దిగజార్చేలా పోస్టులు, కామెంట్లు పెట్టిన వారిపై క్రిమినల్‌ ధిక్కార పిటిషన్‌ దాఖలు చేసేందుకు అనుమతి కోరారు. ఈ లేఖలను పరిశీలించిన ఏజీ శ్రీరామ్‌ స్వయంగా కోర్టు ధిక్కార పిటిషన్‌ దాఖలు చేశారు. ఇందులో న్యాయమూర్తులు, న్యాయాధికారిపై కామెంట్లు చేసిన వారిని కూడా ప్రతివాదులుగా చేర్చారు.


First Published:  28 Sept 2023 11:28 AM IST
Next Story