నారాయణ భార్యని ఇంటి దగ్గరే విచారించండి
నోటీసులపై నారాయణ కుటుంబ సభ్యులు, ఉద్యోగులు హైకోర్టుని ఆశ్రయించారు. నారాయణ తరపున మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టులో వాదనలు వినిపించారు.
మాజీ మంత్రి నారాయణ భార్య రమాదేవి, వారి సంస్థలలో ఉద్యోగి అయిన ప్రమీలను వారి ఇంట్లోనే విచారించాలని ఏపీ సీఐడీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. టిడిపి ప్రభుత్వ హయాంలో పురపాలక శాఖ మంత్రిగా పనిచేసిన నారాయణ విద్యాసంస్థల అధినేత పొంగూరు నారాయణ అప్పట్లో ప్రభుత్వ నిర్ణయాలలో కీలకంగా వ్యవహరించారు. రాజధాని ఎంపిక, నిర్మాణ కమిటీ నారాయణ ఆధ్వర్యంలోనే నియామకమైంది.
మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు సీఐడీ కేసులు నమోదు చేసింది. అమరావతి మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ మార్పులపై ఏపీ సీఐడీ నమోదు చేసిన కేసులలో మాజీ మంత్రి నారాయణ, ఆయన భార్య రమాదేవి, నారాయణ సంస్థల ఉద్యోగి ప్రమీల, రామకృష్ణ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ ఎండీ అంజనీ కుమార్‌కు సీఐడీ నోటీసులు జారీ చేసింది. మార్చి 6న గుంటూరులోని సీఐడీ కార్యాలయంలో విచారణకు రావాలని నోటీసులలో కోరింది. ఇదే కేసులో నారాయణ కుమార్తెలు సింధూర, శరణిలకు సాక్షులుగా హాజరు కావాలని, అల్లుడు పునీత్, నారాయణ సంస్థల ఉద్యోగి వరుణ్ కుమార్‌ను మార్చి 7, 8 తేదీల్లో సీఐడీ ఎదుట హాజరు కావాలని నోటీసులు ఇచ్చిన విషయం విధితమే.
నోటీసులపై నారాయణ కుటుంబ సభ్యులు, ఉద్యోగులు హైకోర్టుని ఆశ్రయించారు. నారాయణ తరపున మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టులో వాదనలు వినిపించారు. మహిళలను ఇంటి వద్దనే విచారించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులున్నాయని దమ్మాలపాటి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వాదనలు పరిగణనలోకి తీసుకొన్న కోర్టు పిటీషనర్లను ఇంటి వద్దనే విచారించాలని ఆదేశాలు జారీ చేసింది.