టీవీ9 ఛానల్ పై సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్‌కి ఫిర్యాదు
2023 ఫిబ్రవరి 1వ తేదీన మధ్యాహ్నం 12.40 గంటలకు తెలుగు వార్తా ఛానల్ టీవీ9లో సుప్రీం కోర్టు పేరుతో ఉద్దేశపూర్వకంగా అబద్ధాలను ప్రసారం చేసిందని న్యాయవాది లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు.
తెలుగు న్యూస్ ఛానల్ టీవీ9 పై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కి హైకోర్టు న్యాయవాది ఫిర్యాదు చేశారు. టీవీ9 తెలుగు న్యూస్ ఛానల్ వార్తల పేరుతో ఉద్దేశపూర్వకంగా అబద్ధాలను ప్రసారం చేస్తోందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, కేంద్ర సమాచార శాఖ కార్యదర్శికి హైకోర్టు న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ లేఖలు రాశారు.
సుప్రీం కోర్టు ఎటువంటి తీర్పులు ఇవ్వకపోయినా, తీర్పులు ఇచ్చినట్టు కోర్టులను తప్పుదోవ పట్టించేలా, న్యాయవ్యవస్థని ప్రభావితం చేసేలా చేస్తున్న ప్రసారాలపై చర్యలు తీసుకోవాలని కోరారు.
2023 ఫిబ్రవరి 1వ తేదీన మధ్యాహ్నం 12.40 గంటలకు తెలుగు వార్తా ఛానల్ టీవీ9లో సుప్రీం కోర్టు పేరుతో ఉద్దేశపూర్వకంగా అబద్ధాలను ప్రసారం చేసిందని న్యాయవాది లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు.
ప్రజల్లో ప్రతికూల వాతావరణాన్ని సృష్టించాలనే ఉద్దేశంతో టీవీ9 న్యూస్ ఛానల్ అబద్ధాలను వార్తగా ప్రసారం చేసిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అత్యున్నత న్యాయస్థానం తీర్పుల పేరుతో అవాస్తవాలు, అసత్యాలు ప్రసారం చేసి సుప్రీంకోర్టు ప్రతిష్టను టీవీ9 మంటగలిపిందని తెలిపారు.
ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఇలాంటి అసత్యాలను ప్రసారం చేయడంలో నేరపూరిత కుట్ర కనిపిస్తోందని అనుమానించారు. సుప్రీంకోర్టు పేరుతో తప్పుడు వార్తలు ప్రసారం చేసిన టీవీ9 ఎడిటర్, మేనేజ్‌మెంట్ పై సుమోటో చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు.