Telugu Global
Andhra Pradesh

ఏపీలో హై అలర్ట్.. 628 గ్రామాలపై వరద ప్రభావం..

ప్రస్తుతం ఆయా ప్రాంతాలకు సంబంధించి 62,337 మందిని 220 పునరావాస కేంద్రాలకు తరలించినట్టు అధికారులు ప్రకటించారు.

ఏపీలో హై అలర్ట్.. 628 గ్రామాలపై వరద ప్రభావం..
X

గోదావరి ఉగ్రరూపంతో తెలంగాణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎగువనుంచి వరద ప్రభావం తగ్గినా తెలంగాణ ప్రాంతంలో గోదావరి శాంతించేందుకు మరికొన్నిగంటలు సమయం పట్టేలా ఉంది. ఇటు ఏపీలో కూడా అధికారులు అప్రమత్తం అయ్యారు. తెలంగాణ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ఏపీలో ముందస్తు చర్యలు చేపట్టారు. విపత్తుల సంస్థలోని స్టేట్ కంట్రోల్ రూమ్ నుంచి నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోంది.

గోదావరితో పాటు కృష్ణా, తుంగభద్ర నదుల్లో వరద ప్రవాహం తీవ్రంగా ఉంది. ప్రాజెక్టులన్నీ నిండుకుండల్లా మారాయి. ఇప్పటివరకు ఆరు జిల్లాల్లోని 42 మండలాల్లో 279 గ్రామాలు వరద బారిన పడ్డాయి. మొత్తంగా ఏపీలో 628 గ్రామాలు వరద ప్రభావానికి లోనవుతాయని అంచనా. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 21 మండలాలు, తూర్పుగోదావరిలో 9మండలాలు, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 5, పశ్చిమ గోదావరి లో 4, ఏలూరు 3, కాకినాడ జిల్లాలో 2 మండలాలపై వరద ప్రభావం ఉంటుంది. ప్రస్తుతం ఆయా ప్రాంతాలకు సంబంధించి 62,337 మందిని 220 పునరావాస కేంద్రాలకు తరలించినట్టు అధికారులు ప్రకటించారు.

ధవళేశ్వరం మూడో హెచ్చరిక..

ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 23.20 లక్షల క్యూసెక్కులుగా ఉంది. ఇక్కడ నీటిమట్టం మరింత పెరిగే అవకాశముంది. ఇన్ ఫ్లో 25 లక్షల క్యూసెక్కులకు చేరుతుందని అంచనా. ప్రస్తుతం ఇక్కడ మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 10 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, 10 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. వరద ఉధృతి దృష్ట్యా అదనపు సహాయక బృందాలను తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. రాజమండ్రిలో రెండు హెలికాప్టర్లు సిద్ధంగా ఉన్నాయి. అత్యవసర సర్వీసుల కోసం, పరిస్థితిని సమీక్షించేందుకు వీటిని వినియోగించుకుంటున్నారు. గ్రామాల్లో పారిశుధ్య సమస్య రాకుండా, తాగునీరు కలుషితం కాకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు అధికారులు.

ముంపు గ్రామాలను ఖాళీ చేయించండి..

గోదావరి ముంపు గ్రామాలన్నింటినీ ఖాళీ చేయించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. లంక గ్రామాలతో పాటు వరద ప్రభావం ఉన్న గ్రామాలన్నింటినీ ఖాళీ చేయించాలని, గోదావరి గట్లకు ఆనుకుని ఉన్న గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టి లోతట్టు ప్రాంతాల వారందరినీ సహాయ శిబిరాలకు తరలించాలని కలెక్టర్లు, ఎస్పీలకు ఆదేశాలిచ్చారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఒక్కో కుటుంబానికి 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ బంగాళా దుంపలు, కిలో పామాయిల్, కేజీ ఉల్లిపాయలు, పాలు అందించాలని చెప్పారు. 48 గంటల్లో వరద ప్రభావిత కుటుంబాలకు వీటిని చేర్చాలన్నారు. సహాయ శిబిరాల్లో ఉంచే ప్రతి కుటుంబానికీ రూ.2 వేలు ఇవ్వాలని సూచించారు.

First Published:  16 July 2022 8:47 AM IST
Next Story