గన్నవరం విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత..?
కృష్ణాజిల్లా గన్నవరం విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడినట్టు విశ్వసనీయంగా తెలిసింది.
కృష్ణాజిల్లా గన్నవరం విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడినట్టు విశ్వసనీయంగా తెలిసింది. గురువారం సాయంత్రం దుబాయ్ నుంచి వచ్చిన విమానంలో ఈ బంగారం పట్టుకున్నట్టు సమాచారం. హైదరాబాద్ నుంచి వచ్చిన కస్టమ్స్ స్పెషల్ టీమ్ గురువారం సాయంత్రం నుంచి గన్నవరం విమానాశ్రయంలో దర్యాప్తు చేస్తున్నట్టు తెలిసింది.
ఒక అధికారి భార్య దుబాయ్ నుంచి వస్తూ బంగారం తీసుకుని వచ్చినట్టు కస్టమ్స్ అధికారుల పరిశీలనలో వెల్లడైనట్టు సమాచారం.
సదరు మహిళకు ఎయిర్ ఇండియా సంస్థలోని పలువురు సిబ్బంది సహకరించినట్టు తెలుస్తోంది. వారిలో ఇద్దరు సిబ్బంది ఉండగా, వారిలో ఒకరు కింది స్థాయి ఉద్యోగి అని, మరొకరు పై స్థాయి ఉద్యోగి అని సమాచారం.
బంగారం తీసుకొని వచ్చిన మహిళ ను కస్టమ్స్ అధికారులు విచారిస్తున్నట్లు సమాచారం. ఆమెతో పాటు సహకరించిన సిబ్బందిని కూడా విచారణ చేస్తున్నట్టు తెలిసింది.
సిబ్బంది సహకారం కూడా ఉండటం గమనిస్తే.. గన్నవరం విమానాశ్రయంలో ఇలాంటి ఘటనలు ఇంతకుముందు ఎన్ని జరిగి ఉంటాయోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే మొదటిసారి అయ్యుండదని, ఇంతకుముందు ఎలాంటి ఘటనలు జరిగాయనే కోణంలోనూ విచారణ చేస్తున్నారని తెలిసింది.
ఈ ఘటన నేపథ్యంలో గన్నవరం విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా సిబ్బంది విషయంలో ఆ సంస్థ కఠిన నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉంటుంది. దీంతో పాటు గన్నవరం విమానాశ్రయంలో పటిష్టంగా తనిఖీలు నిర్వహించేందుకు చర్యలు తీసుకునే అవకాశముంది.