విజయవాడ హాట్ గురూ..
విజయవాడ పార్లమెంట్ స్థానాన్ని ఈసారి దక్కించుకుని తీరాలని వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల అన్వేషణలో ఉంది. ఈ నేపథ్యంలో సినీహీరో అక్కినేని నాగార్జున పేరు తెరమీదకు వచ్చింది.
విజయవాడ పార్లమెంట్ స్థానంపై హాట్ హాట్‌గా చర్చలు నడుస్తున్నాయి. ఈసారి ఎవరు ఎంపీ అవుతారనేదానికన్నా ముందు అసలు ఎవరు అభ్యర్థులుగా ఉంటారనే అంశం హాట్ టాపిక్‌గా మారింది. గత లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 22 ఎంపీ స్థానాల్ని గెల్చుకున్న వైఎస్సార్‌సీపీ వచ్చే ఎన్నికల్లో మొత్తం 25 సీట్లను గెల్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. వాటిలో గతంలో తెలుగుదేశం గెల్చుకున్న విజయవాడను ఈసారి దక్కించుకుని తీరాలని అభ్యర్థుల అన్వేషణలో వైఎస్సార్‌సీపీ ఉంది. ఈ నేపథ్యంలో సినీహీరో అక్కినేని నాగార్జున పేరు తెరమీదకు వచ్చింది. విజయవాడ లోక్‌సభ స్థానం పరిధిలో గెలుపు ఓటముల్ని ప్రభావితం చేయగల కమ్మ సామాజిక వర్గం నుంచే అభ్యర్థిని ఎంపిక చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. అందులో భాగంగా నాగార్జున పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. పార్టీ అధ్యక్షుడు వైెఎస్ జగన్ మోహన్ రెడ్డికి సన్నిహితుడైన నాగార్జున కూడా పోటీకి ఆసక్తిగానే ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
గత ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీచేసి తెలుగుదేశం అభ్యర్థి కేశినేని నాని చేతుల్లో ఓడిపోయిన పొట్లూరి వీరప్రసాద్ (పీవీపీ) కూడా పోటీచేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరోవైపు విజయవాడ నుంచి పోటీ చేసే అభ్యర్థి గట్టిగా వాయిస్ వినిపించే వ్యక్తి అయితే బాగుండని చర్చిస్తున్నట్లు తెలిసింది. అందులో భాగంగా గుడివాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని పేరు కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. కొడాలి నాని అయితే ప్రత్యర్థులను నోరెత్తనీయకుండా మాట్లాడగలరనే ఉద్దేశంతో ఆయన పేరు కూడా పరిశీలిస్తున్నట్లు తెలిసింది.
అందరూ ఈ పేర్లను చర్చిస్తున్నప్పటికీ.. అనూహ్య నిర్ణయాలు తీసుకునే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చివరి క్షణంలో వీరెవరినీ కాకుండా వేరే వారిని అభ్యర్థిగా ఎంపిక చేసినా చేయవచ్చని కూడా భావిస్తున్నారు. ఆయన మనసులో ఏముందో చివరి క్షణం వరకు తెలియదని, అందువల్ల కొత్త వారికి కూడా అవకాశం కల్పించవచ్చని అనుకుంటున్నారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన పారిశ్రామిక వేత్తనుగానీ, ఏదైనా రంగంలో పేరొందిన వ్యక్తినిగానీ రంగంలోకి దించే అవకాశం ఉందని కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
2019 ఎన్నికల్లో 5,75,498 (45.04%) ఓట్లు సాధించిన తెలుగుదేశం అభ్యర్థి కేశినేని నాని ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థి పీవీ ప్రసాద్ 5,66,772 (44.36%) ఓట్లు సాధించారు. అంతకుముందు 2014లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థి కేశినేని నాని ఎంపీగా ఎన్నికయ్యారు. అప్పట్లో ఆయన 5,92,696 (50%) ఓట్లు సాధించారు. ఆ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థి కోనేరు రాజేంద్రప్రసాద్‌కు 5,17,834 (44%) ఓట్లు లభించాయి. 2014 ఎన్నికల్లో 6 శాతం ఓట్ల తేడాతో ఓడిపోయిన వైఎస్సార్ సీపీ 2019 ఎన్నికల్లో ఒక్క శాతం ఓట్ల తేడాతో ఓడిపోయింది.
రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్లుగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, డెవలప్‌మెంట్ కార్యక్రమాలతో వైఎస్సార్ సీపీకి ప్రజాదరణ మరింత పెరిగిందని భావిస్తున్న నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో విజయవాడ టికెట్ కోసం ఆ పార్టీ టికెట్ ఎవరికి దక్కుతుందనేది ఇప్పుడే హాట్ టాపిక్‌గా మారింది.