Telugu Global
Andhra Pradesh

హ్యాట్సాఫ్ టు ఉండవల్లి

మంగళవారం మార్గదర్శి కేసు విచారణ సుప్రీం కోర్టులో జరిగింది. ఈ సందర్భంగా ఉండవల్లి ఇన్ని సంవత్సరాల నుండి వేస్తున్న ప్రశ్ననే సుప్రీం కోర్టు కూడా వేసింది.

హ్యాట్సాఫ్ టు ఉండవల్లి
X

ఎవరైనా కష్టపడి సాధిస్తే వెంటనే పట్టువదలని విక్రమార్కుడిలా సాధించాడు అనంటారు. ఇప్పుడు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ను కూడా పట్టువదలని విక్రమార్కుడనే అనాలి. ఎందుకంటే 17 ఏళ్ళ సుదీర్ఘ పోరాటంతో ఉండవల్లి సాధించారు. ఇంతకీ ఉండవల్లి సాధించింది ఏమిటంటే.. మార్గదర్శి డిపాజిటర్ల వివరాలు, చెల్లింపుల వివరాలు, చెల్లించిన పద్దతి. హోలు మొత్తంమీద మార్గదర్శి ఖాతాదారుల, డిపాజిటర్ల పూర్తి వివరాలు. రామోజీరావు ఛైర్మన్ గా ఉన్న మార్గదర్శి వ్యాపారంపై ఉండవల్లి 2006 నుండి పోరాటం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

చట్టవిరుద్ధంగా వ్యాపారం చేస్తున్న రామోజీ వేలకోట్ల రూపాయల డిపాజిట్లు సేకరిస్తున్నారంటూ ఉండవల్లి కోర్టులో కేసు వేశారు. చాలాకాలం విచారణ జరిగిన తర్వాత హఠాత్తుగా తాను రూ. 2600 కోట్ల డిపాజిట్లను ఖాతాదారులకు వెనక్కి ఇచ్చేసినట్లు రామోజీ కోర్టులో చెప్పారు. ఇకనుండి ఎవరినుండి డిపాజిట్లు సేకరించనని కూడా అఫిడవిట్ రూపంలో ప్రమాణంచేశారు. అయితే తప్పుడు ప్రమాణం చేసినట్లు తర్వాత తేలింది. రూ. 2600 కోట్ల డిపాజిట్లను ఎలా తిరిగిచ్చారు ? ఎవరెవరికి ఎంతెంతిచ్చారు ? ఏ రూపంలో ఇచ్చారని ఉండవల్లి అడుగుతుంటే రామోజీ స్పందించటంలేదు. దీనిపైన కూడా కేసు వేశారు.

మంగళవారం మార్గదర్శి కేసు విచారణ సుప్రీం కోర్టులో జరిగింది. ఈ సందర్భంగా ఉండవల్లి ఇన్ని సంవత్సరాల నుండి వేస్తున్న ప్రశ్ననే సుప్రీం కోర్టు కూడా వేసింది. దానికి రామోజీ లాయర్ బదులిస్తూ డిపాజిట్లన్నింటినీ తిరిగిచ్చేసినట్లు చెప్పారు. డిపాజిట్లన్నీ తిరిగేచ్చేసినప్పుడు ఇక దాపరికం ఏముంది వెంటనే ఆ వివరాలన్నింటినీ ప్రకటించాలని చెప్పింది. అయితే అందుకు రామోజీ లాయర్ ఏదో అభ్యంతరం వ్యక్తంచేయగా సుప్రీం కోర్టు మండిపడింది.

వెంటనే డిపాజిటర్లు, చిట్ ఖాతాదారుల వివరాలను ప్రకటించాల్సిందే అని ఆదేశించింది. దాంతో చేసేదిలేక లాయర్ కూడా అంగీకరించారు. ఈ వివరాల కోసమే ఉండవల్లి 17 ఏళ్ళుగా పోరాడుతున్నారు. కోర్టు విచారణల్లో ఉండవల్లిని రామోజీ ఎన్నెన్నో తిప్పలుపెట్టారు. అయినా మాజీ ఎంపి వెనక్కు తగ్గకుండా పోరాడుతునే ఉన్నారు. ఇన్ని సంవత్సరాల తర్వాత ఉండవల్లి పోరాటం ఫలించింది. మరి సుప్రీం కోర్టు ఆదేశించినట్లు డిపాజిట్ దారుల, ఖాతాదారుల వివరాలను రామోజీ ప్రకటిస్తారా..? ఇందుకనే ఉండవల్లికి హ్యాట్సాఫ్ చెప్పింది.

First Published:  19 April 2023 10:47 AM IST
Next Story