బాపట్ల టీడీపీలో బీసీ, ఎస్సీ, ఎస్టీ నేతల తిరుగుబాటు మొదలైందా..?
ఐ-టీడీపీ క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి ఎలాంటి కృషి చేయడంలేదని గొల్లపల్లి శ్రీనివాసరావు ప్రశ్నించడంతో తట్టుకోలేని మానం శ్రీనివాసరావు ఈ ఘటనకు పాల్పడ్డారు.
ఏపీలోని బాపట్ల నియోజకవర్గంలో ప్రతిపక్ష టీడీపీలో వర్గపోరు తారస్థాయికి చేరిందా..? గత కొంతకాలం నుండి ఆ పార్టీలోని యాదవులు, ఎస్సీ, ఎస్టీ నేతలపై ఆ పార్టీకి చెందిన కమ్మ నేతలు వరుస దాడులకు పాల్పడుతున్న ఘటనలను చూస్తుంటే అర్థమవుతుంది. తాజాగా కమ్మ సామాజికవర్గానికి చెందిన ఐ-టీడీపీ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడైన మానం శ్రీనివాసరావు యాదవ సామాజిక వర్గానికి చెందిన పట్టణ టీడీపీ అధ్యక్షుడు గొల్లపల్లి శ్రీనివాసరావుపై ఏకంగా టీడీపీ సమావేశంలోనే దాడికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది..
ఐ-టీడీపీ క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి ఎలాంటి కృషి చేయడంలేదని గొల్లపల్లి శ్రీనివాసరావు ప్రశ్నించడంతో తట్టుకోలేని మానం శ్రీనివాసరావు ఈ ఘటనకు పాల్పడ్డారు. దీంతో యాదవ సామాజిక వర్గ నేతలు, కార్యకర్తలు తమ నేతపై దాడికి దిగడం ఎంతవరకు సమంజసం అంటూ ధర్నాలకు దిగడం వారి వంతైంది.. టీడీపీలో బీసీలకు విలువ లేదని, అవమానాలు, దాడులు తప్పా తమకు పార్టీ చేసింది ఏమి లేదని వారు ఈ సందర్భంగా వాపోవడం బాపట్ల టీడీపీలో చర్చాంశనీయమైంది. గతంలో కూడా యాదవ సామాజిక వర్గానికి చెందిన ఓ నేత తనయుడైన మద్దిబోయిన రాంబాబుపై నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి వేగశన నరేంద్రవర్మతో పాటు ఆయన తనయుడు రాకేశ్ వర్మ భౌతికదాడులకు దిగి తీవ్రంగా గాయపరిచారు. వీరు దాడిచేయడమే కాకుండా స్థానిక కమ్మ నేతల దాడులకు కూడా మద్ధతుగా నిలవడంతో బీసీ వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైంది.
నియోజకవర్గంలో దాదాపు ఇరవై నుండి ముప్పై వేల వరకు ఉన్న తమ సామాజికవర్గ నేతలపై దాడులకు దిగడం యాదవ వర్గాలు తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది. కేవలం మూడు వేల ఓట్లున్న క్షత్రియ సామాజిక వర్గ నేతలతో కలిసి తొమ్మిది వేల లోపు ఓట్లున్న కమ్మ సామాజిక వర్గ నేతలు తమపై దాడులకి దిగడంతో రానున్న రోజుల్లో టీడీపీకి సరైన బుద్ధి చెప్పాలనే కృతనిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తుంది.