Telugu Global
Andhra Pradesh

ముద్రగడ దగ్గరకు రాయబారం పంపారా..?

పవన్ వారాహి యాత్ర మొదలవుతున్న నేపథ్యంలో మద్దతు ఇవ్వాలని సదరు నేత ముద్రగడను అడిగారట. అందుకు ముద్రగడ మాట్లాడుతూ పార్టీ అధినేత పంపితే వచ్చారా..? లేకపోతే సొంతంగా మీ అంతట మీరుగానే వచ్చారా..? అనడిగారట.

ముద్రగడ దగ్గరకు రాయబారం పంపారా..?
X

ముద్రగడ దగ్గరకు రాయబారం పంపారా..?

ఇప్పుడీ విషయమే తూర్పుగోదావరి జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. ఈనెల 14వ తేదీ నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్ర మొదలవుతున్న విషయం తెలిసిందే. ఈ యాత్రను ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి మొదలుపెడుతున్నారు. ప్రత్తిపాడు అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చే వ్యక్తి ముద్రగడ పద్మనాభమే. కాపు రిజర్వేషన్ల కోసం ముద్రగడ చేసిన ఉద్యమాలు అప్పట్లో రాష్ట్రంలో ఎంత కలకలం సృష్టించింది అందరికీ తెలుసు.

కాపుల కోసం అంతగా ఆందోళనలు చేసిన ముద్రగడ మామూలుగా అయితే జనసేనలో ఉండుండాలి. కానీ, ఆయన మాత్రం పార్టీకి దూరంగానే ఉంటున్నారు. పైగా పవన్ పొడంటేనే గిట్టకుండా ఉన్నారు. అందుకనే ఒకళ్ళ విషయంలో మరొకళ్ళు జోక్యం చేసుకోకుండా పవన్-ముద్రగడ సమాంతర రేఖలుగా వ్యవహారాలు నడిపిస్తున్నారు. అలాంటి ముద్రగడ దగ్గరకు జనసేన ప్రధాన కార్యదర్శిగా ఉన్న నేత వెళ్ళారట. ఈ ప్రధాన కార్యదర్శి ఉత్తరాంధ్రకు చెందిన వ్యక్తి.

పవన్ వారాహి యాత్ర మొదలవుతున్న నేపథ్యంలో మద్దతు ఇవ్వాలని సదరు నేత ముద్రగడను అడిగారట. అందుకు ముద్రగడ మాట్లాడుతూ పార్టీ అధినేత పంపితే వచ్చారా..? లేకపోతే సొంతంగా మీ అంతట మీరుగానే వచ్చారా..? అనడిగారట. ఇప్పుడు తన మద్దతు కావాలని అనుకుంటున్నప్పుడు గతంలో తాను ఉద్యమాలు చేసినప్పుడు మీ అధినేత ఎప్పుడైనా తనకు మద్దతు ఇచ్చారా..? అని నిలదీశారట. చంద్రబాబునాయుడు ప్రభుత్వం తనతో పాటు తన కుటుంబాన్ని అవమానించినప్పుడు కనీసం మీ అధినేత పరామర్శకు కూడా ఎందుకు రాలేదని ప్రశ్నించారట.

రాబోయే ఎన్నికల్లో జనసేన 175 సీట్లలోనూ పోటీచేస్తుందా..? అని సదరు ప్రధాన కార్యదర్శిని అడిగారట. దానికి ఆ నేత ఏమీ సమాధానం చెప్పలేకపోయారట. ఏదో మద్దతుకోరుదామని వచ్చి అనవసరంగా ఇరుక్కున్నానని అనుకుని వెంటనే వెళ్ళిపోయారట. ఇక్కడ విషయం ఏమిటంటే.. ప్రత్తిపాడు నుంచి పవన్ మొదలుపెడుతున్న వారాహి యాత్ర ముద్రగడను టార్గెట్ చేసుకునే అని కాపుల్లో చర్చ నడుస్తోంది. ప్రత్తిపాడు నియోజకవర్గంలోకే ముద్రగడ సొంతూరు కిర్లంపూడి వస్తుంది. మరి యాత్ర మొదలైతే కానీ పవన్ టార్గెట్ ఎవరనే విషయంపై క్లారిటీ రాదు.

First Published:  12 Jun 2023 10:34 AM IST
Next Story