Telugu Global
Andhra Pradesh

పవన్‌కు కౌంట్ డౌన్ స్టార్టయ్యిందా?

మొత్తంమీద ఇక్కడ గమనించాల్సిందేమంటే విశ్లేషకులైనా, ఎల్లో మీడియాలో చర్చలైనా పవన్ కేంద్రంగా మాత్రమే జరుగుతున్నాయి. ఎవరు కూడా బీజేపీని టార్గెట్ చేయటం లేదు.

పవన్‌కు కౌంట్ డౌన్ స్టార్టయ్యిందా?
X

అందరు అనుమానిస్తున్నట్లే జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై దాడి మొదలైంది. కాకపోతే ఈ దాడి ప్రస్తుతానికి ఎల్లో మీడియాలో విశ్లేషకుల రూపంలో మొదలైంది. అంటే పవన్‌కు ఎల్లో బ్యాచ్ నుంచి కౌంట్ డౌన్ స్టార్టయినట్లే అనుకోవాలి. ఎల్లో మీడియా ఛానళ్ళల్లో చంద్రబాబు నాయుడు ప్రయోజనాల కోసమే విశ్లేషకుల రూపంలో చాలామంది పనిచేస్తున్నారు. వీరు కాకుండా డైరెక్టుగా పనిచేస్తున్న సీపీఐ కార్యదర్శి రామకృష్ణ లాంటి వాళ్ళు ఉండనే ఉన్నారు.

ఇప్పుడు రామకృష్ణయినా లేకపోతే కొలికిపూడి శ్రీనివాస్, జడ శ్రవణ్ కుమార్ అయినా పవన్‌పై మాటలతో దాడులు మొదలుపెట్టేశారు. విశ్లేషకులతో దాడులు చేయించటం మొదటి అంకం అన్నమాట. తర్వాత నేరుగా ఎల్లో మీడియానే విశ్లేషణలంటు మొదలుపెడుతుంది. మూడో స్టేజిలో తమ్ముళ్ళు పిక్చర్లోకి వస్తారు. చివరగా చంద్రబాబు ఎంటరవుతారు. ఇప్పుడు కొలికిపూడి, జడ, రామకృష్ణలు ఏమి చెబుతున్నారంటే బీజేపీ, జనసేన పొత్తులో పవన్ మూడు చోట్ల పోటీ చేసినా ఎక్కడా గెలవరని.

టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకోకుండా పవన్ బీజేపీతో మాత్రమే వెళితే వైసీపీ గెలుపు ఖాయమని రామకృష్ణ ప్రకటించేశారు. వైసీపీ అభ్యర్ధులు హ్యాపీగా ఇంట్లో పడుకున్నా గెలిచిపోతారని చెప్పారు. పవన్ కు తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉండే మీడియా అనవసరమైన హైప్ ఇస్తోందని కొలికిపూడి తెగ బాధపడిపోయారు. అంటే ఇంతకాలం పవన్‌కు ఎల్లో మీడియా అనవసరంగా భుజాన మోసిందని కొలికిపూడి చెప్పకనే చెప్పారు. ఇక మొదటి నుండి చంద్రబాబు, పవన్ పొత్తును వ్యతిరేకిస్తున్న సోషల్ మీడియాలో కొందరు ఇప్పుడు పవన్‌కు వ్యతిరేకంగా రెచ్చిపోతున్నారు.

మొత్తంమీద ఇక్కడ గమనించాల్సిందేమంటే విశ్లేషకులైనా, ఎల్లో మీడియాలో చర్చలైనా పవన్ కేంద్రంగా మాత్రమే జరుగుతున్నాయి. ఎవరు కూడా బీజేపీని టార్గెట్ చేయటం లేదు. పవన్ వైఖరి స్పష్టమయ్యే కొద్దీ రెండో అంకం.. తర్వాత మూడో స్టేజికి పవన్ వ్యతిరేక ప్రచారం చేరుకుంటుందనటంలో అనుమానమే లేదు. మొత్తానికి పవన్ను టార్గెట్ చేయటానికి విశ్లేషకులు, ఎల్లో మీడియా, తమ్ముళ్ళు, టీడీపీ సోషల్ మీడియా వింగ్ కాచుకుని కూర్చున్న విషయం అర్ధమైపోతోంది. మరి దీన్ని పవన్ ఎలా తట్టుకుంటారో చూడాల్సిందే.

First Published:  17 Nov 2022 12:00 PM IST
Next Story