పొత్తుపై మోడీ తేల్చేశారా..?
పొత్తులు, సీట్లలో పోటీపై చంద్రబాబు మీదే కాదు తనపైన కూడా ఒత్తిడి ఉందని పవన్ ప్రకటించారు. పైగా మొత్తం సీట్లలో మూడోవంతు సీట్లు జనసేనకు కేటాయించాల్సిందే అని స్పష్టంగా చెప్పేశారు.
ఈమధ్య ఏపీకి చెందిన కొందరు బీజేపీ నేతలు ఢిల్లీలో పీఎం నరేంద్రమోడీని కలిశారట. ఆ సమయంలో టీడీపీతో పొత్తుల విషయాలను ప్రస్తావించారట. దానికి మోడీ సమాధానం ఇస్తూ టీడీపీతో పొత్తుండదని స్పష్టంగా చెప్పేశారట. ఏపీలో జనసేనతో తప్ప ఇంకే పార్టీతోనూ బీజేపీకి పొత్తుండదని చెప్పినట్లు విశ్వసనీయవర్గాలు చెప్పాయి. ఇదే విషయాన్ని కమలనాథులు జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో చెప్పారట.
కమలనాథుల సమాచారం ప్రకారం ఎన్నికలకు ముందు పవన్ బీజేపీతో మాత్రమే పొత్తు పెట్టుకుంటారట. మరిప్పుడు టీడీపీతో కలిసి వెళుతున్నారు కదా.. అని అడిగినప్పుడు ఇప్పుడు ఎవరితో ఉన్నా.. చివరకు పవన్ నడిచేది బీజేపీతో మాత్రమే అని చెప్పారు. పార్టీలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే తెరవెనుక పవన్ను గట్టిగా బీజేపీ అగ్రనేతలు ఎక్కడో నొక్కినట్లున్నారు. అందుకనే టీడీపీతో పొత్తుపై దాని ప్రభావం కనబడుతోంది. చంద్రబాబునాయుడు రెండు నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించారని పవన్ కూడా రెండు నియోజకవర్గాల్లో జనసేన పోటీచేస్తుందని ఆ నియోజకవర్గాల పేర్లు ప్రకటించారు.
పొత్తులు, సీట్లలో పోటీపై చంద్రబాబు మీదే కాదు తనపైన కూడా ఒత్తిడి ఉందని పవన్ ప్రకటించారు. పైగా మొత్తం సీట్లలో మూడోవంతు సీట్లు జనసేనకు కేటాయించాల్సిందే అని స్పష్టంగా చెప్పేశారు. మూడోవంతు సీట్లంటే 58 నియోజకవర్గాలను చంద్రబాబు ఎలాగూ ఇవ్వరని పవన్ కు బాగా తెలుసు. అయినా 58 సీట్లు కేటాయించాలని అడిగారంటే తెరవెనుక పవన్ను కమలనాథులే నడుపుతున్నట్లు అనుమానాలు పెరిగిపోతున్నాయి. బీజేపీని వదిలేసి టీడీపీతో మాత్రమే వెళితే జరగబోయే నష్టాలను, ఎదురవ్వబోయే కష్టాలను పవన్ కు అర్థమయ్యేట్లు చెప్పారట.
అందుకనే టీడీపీతో పొత్తు విషయంపై పవన్‌లో మార్పొచ్చిందంటున్నారు. ఆ విషయం చంద్రబాబు వైఖరిని డైరెక్టుగా పవన్ తప్పుపట్టడంతోనే అర్థమవుతోంది. చంద్రబాబు పొత్తుధర్మాన్ని పాటించకుండా తప్పుచేశారని పవన్ మాటల్లో అసంతృప్తి కనబడింది. పార్టీ ఆఫీసులో జరిగిన నేతల సమావేశంలో చంద్రబాబుపై పవన్ యధాలాపంగా మాట్లాడలేదని బీజేపీ స్క్రిప్ట్ ప్రకారమే మాట్లాడారనే ప్రచారం ఇప్పటికే జరుగుతోంది. కమలనాథుల మాటలు, జరుగుతున్న పరిణామాలు అన్నింటినీ గమనిస్తుంటే టీడీపీతో పొత్తుండదనే అనిపిస్తోంది.