పవన్‌లో భయం మొదలైందా..?
ఇలాంటి నేపథ్యంలోనే ఏపీలోకి బీఆర్ఎస్ ఎంట్రీ ఇవ్వటాన్ని పవన్ జీర్ణించుకోలేకపోతున్నారు. బీఆర్ఎస్ పోటీచేయటం వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓట్లలో చీలిక రావటం ఖాయమని డిసైడ్ అయిపోయినట్లున్నారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ లో అప్పుడే భయం మొదలైనట్లుంది. పార్టీ అధినేత రైట్ హ్యాండ్ నాదెండ్ల మనోహర్ మాట్లాడిన మాటలు చూస్తుంటే ఈ విషయం అర్థమైపోతోంది. ఏపీలోకి బీఆర్ఎస్ ఎంట్రీపై నాదెండ్ల అభ్యంతరం వ్యక్తంచేశారు. ఏపీలోకి ఎంట్రీ ఇచ్చి బీఆర్ఎస్ ఏమి సాధించగలదని ప్రశ్నించారు. కేవలం జగన్మోహన్ రెడ్డికి సాయం అందించటానికి, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చటానికే బీఆర్ఎస్ ఏపీలో పోటీచేయబోతున్నట్లు నాదెండ్ల అభిప్రాయపడ్డారు. రాబోయే ఎన్నికల్లో జనసేన ఓట్లు చీల్చేందుకు మాత్రమే బీఆర్ఎస్ ఏపీలో పోటీచేయబోతున్నట్లు చెప్పారు.
బీఆర్ఎస్ లో చిత్తశుద్ది ఉంటే ఏపీకి చేయబోయే మంచేమిటో జనాలకు వివరించాలని నాదెండ్ల డిమాండ్ చేయటం చాలా విచిత్రంగా ఉంది. పార్టీ పెట్టి ఇప్పటికి సుమారు 10 ఏళ్ళవుతున్నా ఇంతవరకు పార్టీ నిర్మాణం జరగని, మేనిఫెస్టో కూడా లేని జనసేన కూడా మేనిఫెస్టో విషయంలో కేసీఆర్ ను నిలదీస్తుండటమే ఆశ్చర్యంగా ఉంది. ఇక బీఆర్ఎస్ ఎంట్రీతో ఏపీలో ఓట్ల చీలిక ఖాయమని జనసేనలో భయం మొదలైనట్లే ఉంది.
ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీలనివ్వనని, జగన్ను ఓడిస్తానని ఇప్పటికే పవన్ చాలాసార్లు ఛాలెంజ్‌లు విసిరిన విషయం తెలిసిందే. నిజానికి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చటం, చీలనివ్వకపోవటం, జగన్ను ఓడించటం అన్నది పవన్ చేతిలో లేదు. ఈ విషయం 2019 ఎన్నికల్లోనే స్పష్టంగా బయటపడింది. పోయిన ఎన్నికల్లో ఇలాంటి ఛాలెంజ్‌లు చేసి తలబొప్పి కొట్టించుకున్నారు. అయినా పద్దతిని మార్చుకోవటంలేదు. తాను చెప్పగానే జనాలంతా వైసీపీకి వ్యతిరేకంగా ఓట్లేసేస్తారనే భ్రమలో ఉన్నారు పవన్.
ఇలాంటి నేపథ్యంలోనే ఏపీలోకి బీఆర్ఎస్ ఎంట్రీ ఇవ్వటాన్ని పవన్ జీర్ణించుకోలేకపోతున్నారు. బీఆర్ఎస్ పోటీచేయటం వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓట్లలో చీలిక రావటం ఖాయమని డిసైడ్ అయిపోయినట్లున్నారు. అలాగే జనసేనను దెబ్బకొట్టేందుకే బీఆర్ఎస్ ఏపీలో ఎంట్రీ ఇస్తోందని అనుకుంటున్నట్లున్నారు. మరి ఏ ఉద్దేశ్యంతో తెలంగాణాలో జనసేన పోటీచేస్తుందని పవన్ ప్రకటించారు..? అందుకనే బీఆర్ఎస్ ఎంట్రీపై పవన్ తాను మాట్లాడకుండా నాదెండ్లతో మాట్లాడించారు. మాట్లాడింది నాదెండ్లే అయినప్పటికీ పవన్లో భయం మొదలైందన్న విషయం స్పష్టంగా అర్థమైపోతోంది.