50 సీట్లలో పోటీ చెయ్.. పవన్‌కు అల్టిమేటమ్
వారం కిందట కూడా పవన్‌కు ఓ లేఖ రాశారు హరిరామ జోగయ్య. ఆ లేఖలో పవన్ నర్సాపురం, భీమవరం, తాడేపల్లిగూడెంలలో ఏదో ఒకచోట పోటీ చేయాలని సూచించారు.
ఏపీ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల పోరుకు రెడీ అవుతున్నాయి. పొత్తుల విషయంలో టీడీపీ, జనసేన మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు మరో లేఖ రాశారు మాజీమంత్రి, సీనియర్ నాయకుడు హరిరామజోగయ్య. 50 నియోజకవర్గాల్లో పోటీ చేయాల్సిందేనని పవన్‌కు అల్టిమేటమ్ ఇచ్చారు.
పవన్ కల్యాణ్ పోటీ చేసేందుకు 3 ఎమ్మెల్యే నియోజకవర్గాలను సూచించారు. నర్సాపురం, గాజువాక, తిరుపతి నుంచి పవన్ పోటీ చేయొచ్చని సలహా ఇచ్చారు. తిరుపతి అయితే బెటర్, అక్కడి నుంచి పోటీచేస్తే గెలుపు ఖాయమని పవన్ కళ్యాణ్‌కు సూచించారు. తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్ ఎన్నికల్లో పోటీచేయాలని తెలిపారు జోగయ్య. అలాగే 50 నియోజకవర్గాలలో ఎవరికి ఎమ్మెల్యే టిక్కెట్లు ఇవ్వాలో లేఖలో పేర్కొన్నారు.
వారం కిందట కూడా పవన్‌కు ఓ లేఖ రాశారు హరిరామ జోగయ్య. ఆ లేఖలో పవన్ నర్సాపురం, భీమవరం, తాడేపల్లిగూడెంలలో ఏదో ఒకచోట పోటీ చేయాలని సూచించారు. అదేవిధంగా రెండున్నరేళ్లు పవన్ సీఎం పదవి చేపట్టాలని తెలిపారు.
టీడీపీ, జనసేన మధ్య పవర్‌షేరింగ్ అంశం ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలన్నారు. సీఎం ప్రతిపాదన అంశం ప్రజల్లోకి వెళ్తే టీడీపీ, జనసేన మధ్య ఓటు బదిలీ అవుతుందని సూచించారు. హరిరామ జోగయ్య సూచనల్ని పవన్ పరిగణలోకి తీసుకుంటారా లేదా అన్నది పక్కన పెడితే... పవన్‌కు మాత్రం జోగయ్య నుంచి షాక్ ట్రీట్మెంట్ గట్టిగానే అందుతోంది.
ఓవైపు బేషరతుగా పవన్ టీడీపీకి మద్దతు తెలిపితే జోగయ్య మాత్రం పవన్‌ను లిస్టుల మీద లిస్టులు పంపుతూ ట్విస్టులిస్తున్నారు. సీఎం పదవిని వదిలే సమస్యలేదని, 50స్థానాలకు తగ్గకుండా పోటీ చేయాలని ఒత్తిడి తెస్తున్నారు. మొత్తానికి పవన్ కల్యాణ్‌కు హరిరామ జోగయ్య టెన్షన్ పట్టుకుందన్న చర్చ జోరుగా జరుగుతోంది.