సినిమాలు మానేయొద్దు.. పవన్ కు హరిరామజోగయ్య లేఖ
సినిమాల విషయంలో పవన్ కల్యాణ్ కి సలహా ఇచ్చారు హరిరామజోగయ్య. సినిమాలు మానేయకుండా రాజకీయాల్లో కొనసాగాలన్నారు.
ఎన్నికల వేళ పవన్ కల్యాణ్ కు ఇద్దరు లేఖాస్త్రాలు సంధించేవారు. ముద్రగడ పద్మనాభం ఇటీవల తన పేరు మార్చుకుని సైలెంట్ అయిపోగా, హరిరామజోగయ్య మాత్రం ఇంకా లేఖలు రాస్తూనే ఉన్నారు. ఎన్నికల ముందు టీడీపీకి పవన్ కల్యాణ్ మద్దతుని ఆయన పూర్తిగా సమర్థించలేదు. అధికారంలో వాటా అడగాలన్నారు, జనసేన 21 సీట్లకు పరిమితం కావడమేంటని ప్రశ్నించారు. ఫలితాల తర్వాత మాత్రం హరిరామజోగయ్య పూర్తిగా స్టైల్ మార్చారు. పవన్ వ్యూహాన్ని మెచ్చుకుంటూనే ఆయనకు మరిన్ని ఉచిత సలహాలిచ్చారు.
ముందుగా తన లేఖలో సీఎం చంద్రబాబుకి, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కి శుభాకాంక్షలు తెలిపారు హరిరామజోగయ్య. వారిద్దరి హయాంలో ఏపీలో అభివృద్ధి, సంక్షేమం రెండూ సమపాళ్లలో పరుగులు పెట్టాలని ఆకాంక్షించారు. కాపులకు ఐదుశాతం రిజర్వేషన్లు అమలుచేయాలని కూడా కోరారు. కృష్ణా జిల్లాకు వంగవీటి మోహనరంగా పేరు పెట్టాలని కూడా హరిరామ జోగయ్య పవన్ కల్యాణ్ ని కోరడం విశేషం. మండల పరిషత్, పంచాయతీ వ్యవస్థలను బలోపేతం చేయాలన్నారు.
అటు పవర్.. ఇటు స్టార్
సినిమాల విషయంలో కూడా పవన్ కల్యాణ్ కి కీలక సలహా ఇచ్చారు హరిరామజోగయ్య. సినిమాలు మానేయకుండా రాజకీయాల్లో కొనసాగాలన్నారు. నెలలో సగం రోజులు సినిమాలకు, సగం రోజులు పరిపాలనకు కేటాయించాలని చెప్పారు. ఇటీవల పవన్ కల్యాణ్ తన సినిమాలపై స్పందించిన సంగతి తెలిసిందే. సినిమాలకు సమయం కేటాయించడం కష్టం అని చెప్పారాయన, అయితే ఇప్పటికే ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేస్తానని అన్నారు పవన్. పాలనకే తనకు టైమ్ సరిపోతుందని అన్నారు. రాబోయే సినిమాల్లో OG అనే మూవీ బాగుంటుందని చెప్పి అభిమానుల్ని హుషారెత్తించారు. మరి హరిరామ జోగయ్య సలహా ప్రకారం పవన్ కల్యాణ్ నెలలో సగం రోజులు పాలనకి, సగం రోజులు సినిమాలకు కేటాయిస్తారా, లేక ఫస్ట్ ప్రయారిటీ పాలనకేనని తేల్చి చెబుతారా వేచి చూడాలి.