Telugu Global
Andhra Pradesh

ఇద్దరినీ జోగయ్య ఇరకాటంలో పడేశారా?

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు కాపు సంక్షేమసేన అధ్యక్షుడు జోగయ్య ఒక సూచన మరో కండీషన్ పెట్టారు. సూచనేమో టీడీపీకి అనుకూలంగా ఉండగా కండీషన్ మాత్రం పవన్+చంద్రబాబు గొంతులో వెలక్కాయ పడినట్లుంది.

ఇద్దరినీ జోగయ్య ఇరకాటంలో పడేశారా?
X

మద్దతుదారుడని అంటూనే హరిరామజోగయ్య జనసేన అధినేత పవన్ కల్యాణ్, చంద్రబాబు నాయుడును ఇరకాటంలో పడేశారా? ఇప్పుడిదే విషయంపై కాపుల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పవన్‌కు కాపు సంక్షేమసేన అధ్యక్షుడు జోగయ్య ఎంతటి మద్దతుదారుడో అందరికీ తెలుసు. అలాంటి జోగయ్య టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఒక సూచన మరో కండీషన్ పెట్టారు. సూచనేమో టీడీపీకి అనుకూలంగా ఉండగా కండీషన్ మాత్రం పవన్+చంద్రబాబు గొంతులో వెలక్కాయ పడినట్లుంది.

ఇంతకీ విషయం ఏమిటంటే వైసీపీని ఓడించాలంటే టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకోవాల్సిందే అని సూచించారు. జోగయ్య చేసిన సూచన టీడీపీకి బాగా అనుకూలంగా ఉండేదే అనటంలో సందేహం లేదు. ఇదే సమయంలో పవన్ కల్యాణ్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తేనే కాపు సంక్షేమసేన టీడీపీ-జనసేన పొత్తుకు మద్దతుగా నిలుస్తుందని కండీషన్ కూడా పెట్టారు. ఈ కండీషన్ పవన్‌తో పాటు చంద్రబాబుకు ఏమాత్రం రుచించనిదే. నిజానికి టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకోవటం కాపుల్లోనే కొందరికి రుచించటం లేదు.

తాము ఓట్లేసి చంద్రబాబు పల్లకీని ఎందుకు మోయాలనేది కాపు ప్రముఖుల సూటి ప్రశ్న. చాలా జిల్లాల్లో కమ్మ-కాపు మధ్య పెద్ద సఖ్యత లేదు. అందుకనే చంద్రబాబును కొందరు కాపు ప్రముఖులు తీవ్రంగా వ్యతిరేకిస్తుంటారు. ఇదే సమయంలో పవన్‌ను గనుక సీఎం అభ్యర్థిగా చంద్రబాబు ప్రకటిస్తే రెండు పార్టీలకు మద్దతివ్వటంలో వెనకాడాల్సిన అవసరం లేదని కాపుల్లో చర్చ జరుగుతోంది.

ఇక్కడే జోగయ్య ప్రకటన పవన్‌ను ఇరకాటంలో పడేసిందనే అనుకోవాలి. ఎలాగంటే పవన్‌ను సీఎం సీఎం అంటూ అభిమానులు జోగయ్య లాంటి వాళ్ళు మాత్రమే గోల చేస్తున్నారు. నిజానికి సీఎం అవటం పవన్‌కే ఇష్టం ఉన్నట్లులేదు. చంద్రబాబు వచ్చి పవన్‌తో పొత్తు పెట్టుకుంటే ఒకరకంగా ఉంటుంది. అదే పవన్ వెళ్ళి చంద్రబాబుతో పొత్తు కలిపితే పవ‌న్‌కు బేరమాడే శక్తి ఉండదు. టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నట్లు స్వయంగా పవనే ప్రకటించిన తర్వాత ఇక బేర‌మాడే కెపాసిటి పోయినట్లే. సీఎం అవ్వాలని పవన్‌కే లేన‌ప్పుడు జోగయ్య లాంటివాళ్ళు కండీషన్లు పెట్టడమంటే పవన్‌ను ఇరకాటంలో పెట్టినట్లు కాక మరేమిటి ?

First Published:  23 Jan 2023 11:05 AM IST
Next Story