లోకేశ్ సీఎం.. పవన్‌కు జోగయ్య సంచలన లేఖ
బీజేపీ కూటమిలో చేరడానికి ఇష్టపడక అడ్డంకులు సృష్టిస్తుంటే.. జనసేన బాగు కోరే బీజేపీ మీతో ఉండాలని కోరుకున్నందుకు తాను వైసీపీ కోవర్ట్‌ను అయ్యానా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు జోగయ్య.
తెలుగుదేశం పార్టీతో కలిసి తాడేపల్లిగూడెంలో నిర్వహించిన జెండా సభలో జనసేనాని పవన్‌కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య. ఈ మేరకు పవన్‌కల్యాణ్‌కు ఆయన లేఖ రాశారు. జనసేన బాగుకోరి తానిచ్చిన సలహాలు తమకు నచ్చినట్లు లేవని పవన్‌ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.
బహిరంగసభలో తన పేరు పెట్టి నేరుగా విమర్శించకపోయినా.. పచ్చ మీడియా ప్రచారం చూస్తుంటే తనను విమర్శించినట్లుగానే ఉందన్నారు జోగయ్య. చంద్రబాబే సీఎం అని గతంలో లోకేశ్ కామెంట్స్ చేస్తే తాను ఖండించానని.. అందుకు తాను వైసీపీ కోవర్ట్‌నా అంటూ పవన్‌కు ప్రశ్నలు సంధించారు. జనసేనకు దాదాపు 40 నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులు ఉంటే కేవలం 24 ఇచ్చారని.. దానిని తాను ఖండించానని చెప్పారు జోగయ్య. అందుకు తాను వైసీపీ కోవర్ట్‌నా అంటూ లేఖలో ప్రశ్నలు సంధించారు.
బీజేపీ కూటమిలో చేరడానికి ఇష్టపడక అడ్డంకులు సృష్టిస్తుంటే.. జనసేన బాగు కోరే బీజేపీ మీతో ఉండాలని కోరుకున్నందుకు తాను వైసీపీ కోవర్ట్‌ను అయ్యానా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు జోగయ్య. జరుగుతున్న పరిణామాలను బట్టి మిత్రులెవరో.. శత్రువులెవరో తెలుసుకుని ప్రవర్తించడం మంచిదని పవన్‌కు సూచించారు. జనసేన లేకుండా తెలుగుదేశం గెలవడం అసాధ్యమని.. అందుకే చంద్రబాబు మీతో జత కట్టాడని పవన్‌కు చెప్పుకొచ్చారు జోగయ్య. ఎన్నికలయ్యాక పవన్‌కు సముచిత స్థానం చంద్రబాబు ఇస్తాడన్న నమ్మకం లేదని లేఖలో వివరించారు.
ఎన్నికలయ్యాక జనసేనను క్రమంగా నిర్వీర్యం చేసి తన కొడుకును సీఎం చేస్తాడనే భయం జనసైనికుల్లో ఉందన్నారు జోగయ్య. తనను వైసీపీ కోవర్టుగా ప్రచారం చేస్తున్నవారు.. టీడీపీ కోవర్టులు కాదా అంటూ ఎదురు ప్రశ్నలు వేశారు జోగయ్య. ప్యాకేజీ వీరుడిగా పవన్‌పై విమర్శలు వస్తుంటే.. చంద్రబాబు, లోకేష్ ఏనాడైనా ఖండించారా అని లేఖలో నిలదీశారు. మీకు ఇష్టం లేకపోయినా మిమ్మల్ని కాపాడుకోవడం తన విధి అంటూ పవన్‌ను ఉద్దేశించి లేఖ రాశారు జోగయ్య.