ఇద్దరికీ వార్నింగేనా..?
88 ఏళ్ళవయసులోని జోగయ్య ఇంటినుండి బయటకు వచ్చి చేయగలిగిందేమీలేదు. జోగయ్య హెచ్చరికను చంద్రబాబు, పవన్ లెక్కచేస్తారని కూడా ఎవరు అనుకోవటంలేదు.
మొత్తానికి కాపు కురువృద్ధుడు చేగొండి హరిరామజోగయ్య మంట తాజాగా లేఖ రూపంలో బయపటడింది. వచ్చేఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమిగా పోటీచేస్తున్న విషయం తెలిసిందే. పొత్తులో జనసేనకు చంద్రబాబు నాయుడు 24 అసెంబ్లీ, మూడు పార్లమెంటు సీట్లు కేటాయించారు. అప్పటినుండి జనసేన నేతలు, క్యాడర్, కాపు సామాజికవర్గంతో పాటు జోగయ్య కూడా మండిపోతున్నారు. ఇన్ని తక్కువ సీట్లు తీసుకోవటం ఏమిటని జోగయ్య లేఖలో పవన్ను నిలదీశారు. శాసించే స్థాయి నుండి జనసేన దేహీ అనే స్థాయికి పడిపోయిందా అని ప్రశ్నించారు.
అయితే జోగయ్య లేఖకు పవన్ సమాధానం ఇవ్వలేదు. దాంతో మండిపోయిన జోగయ్య తాజగా మరో లేఖ రాశారు. అందులో 29వ తేదీని డెడ్ లైన్ గా హెచ్చరించారు. బడుగు, బలహీన వర్గాలు కోరుకునే రాజ్యాధికారం, కూటమి ప్రభుత్వంలో పవన్ కు పవర్ షేరింగ్, జనసేనకు మంత్రిపదవుల విషయంలో తాడేపల్లిగూడెంలో జరగబోయే బహిరంగసభలో చంద్రబాబు ప్రకటించాలని జోగయ్య డిమాండ్ చేశారు. ఒకవేళ చంద్రబాబు గనుక తన డిమాండ్లపై ఎలాంటి ప్రకటన చేయకపోతే 29వ తేదీనుండి తన కార్యాచరణ ప్రకటిస్తానని వార్నింగ్ ఇచ్చారు.
ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే.. 88 ఏళ్ళవయసులోని జోగయ్య ఇంటినుండి బయటకు వచ్చి చేయగలిగిందేమీలేదు. జోగయ్య హెచ్చరికను చంద్రబాబు, పవన్ లెక్కచేస్తారని కూడా ఎవరు అనుకోవటంలేదు. వాళ్ళు లెక్కచేయకపోయినా జోగయ్య చేసేది కూడా ఏమీలేదు. కాకపోతే ఇంట్లోనే దీక్ష చేస్తానని ప్రకటించే అవకాశముంది. గతంలో ఇదే విధంగా దీక్షంటే పోలీసులు జోగయ్యను ఆసుపత్రిలో జాయిన్ చేసిన విషయం చూసిందే.
కాపులకు జోగయ్యేమీ పెద్దదిక్కు కాదు. నిజానికి ఫశ్చిమగోదావరి కాపులకు తూర్పు గోదావరి జిల్లాలోని కాపులకు మధ్య విభజనుంది. జోగయ్యకు తూర్పుగోదావరి కాపుల్లో చాలామంది పెద్దగా ప్రాధాన్యతివ్వరు. ఇలాంటి నేపథ్యంలో జోగయ్య చేయగలిగింది ఏముంటుంది అనే చర్చ మొదలైంది. కాకపోతే ఈసారి జోగయ్య డిమాండుకు జిల్లాలను పక్కనపెట్టి కాపుల్లో మెజారిటీ మద్దతిస్తున్నారు. జనసేన చాలా తక్కువ సీట్లకు పోటీచేస్తోందనే అభిప్రాయం అందరిలోనూ ఉంది. ఇన్ని తక్కువ సీట్లకు జనసేనను పరిమితం చేసిన కారణంగా టీడీపీకి ఓట్లు బదిలీకాదని కాపు సామాజికవర్గంలో పెద్ద చర్చే జరుగుతోంది. మరి 29వ తేదీన జోగయ్య ప్రకటించబోయే కార్యాచరణ ఏమిటో చూడాల్సిందే.