విశాఖలో పోటీ చేస్తాం.. మొన్న జీవీఎల్, నేడు జేడీ ప్రకటన
విశాఖకు పాలనా రాజధానిగా కావలసినంత ప్రచారం వచ్చేసింది. భవిష్యత్తులో ఏ ప్రభుత్వం వచ్చినా వైజాగ్ క్రేజ్ తగ్గేదేమీ లేదు. అందుకే అక్కడి నుంచి పోటీకి ఆశావహులు పెరుగుతున్నారు.
వచ్చే ఎన్నికల్లో విశాఖపట్నం నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం రాజధానిని మార్చినా మార్చకపోయినా విశాఖకు పాలనా రాజధానిగా కావలసినంత ప్రచారం వచ్చేసింది. భవిష్యత్తులో ఏ ప్రభుత్వం వచ్చినా వైజాగ్ క్రేజ్ తగ్గేదేమీ లేదు. అందుకే అక్కడి నుంచి పోటీకి ఆశావహులు పెరుగుతున్నారు.
పోటీకి సిద్ధమంటున్న జీవీఎల్
బీజేపీ లీడర్, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహరావు వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచి పోటీ చేస్తానని ఇటీవలే ప్రకటించారు. ఇందుకోసం కొన్ని రోజులుగా తాను అక్కడ గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నానని చెప్పుకొచ్చారు. విజయనగరం జిల్లా పర్యటనలో ఆయన ఈ కామెంట్లు చేశారు. 2014 ఎన్నికల్లో బీజేపీ ఎన్నికల వ్యూహ బృందంలో పని చేసిన జీవీఎల్ 2018లో ఉత్తర్‌ప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎంపికయ్యారు. ప్రత్యక్ష ఎన్నికల్లో ఎప్పుడూ పోటీ చేయని జీవీఎల్ వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచి పోటీకి సిద్ధమనడం పార్టీలో చర్చకు దారితీసింది.
వైజాగే నా తొలి ప్రాధాన్యమన్న జేడీ
ఇక సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కూడా వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచి పోటీ చేయడానికే తొలి ప్రాధాన్యమిస్తానని ఆదివారం ప్రకటించారు. విజయవాడలోని ఓ కాలేజ్‌లో జరిగిన ఓటరు అవగాహన సదస్సులో మాట్లాడుతూ ఆయన ఈ కామెంట్ చేశారు. గత ఎన్నికల్లో జనసేన తరఫున విశాఖ ఎంపీ స్థానానికి పోటీపడిన ఆయన 2,88, 874 ఓట్లు తెచ్చుకున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ పోటీకీ సిద్ధమని ప్రకటించారు.